న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 1132 మంది గ్యాలంట్రీ సర్వీసు పతకాలను అందజేయనుంది. ఇందులో తెలంగాణ నుంచి 20 మంది పోలీసులు, ఏపీ నుంచి 9 మంది పోలీసులు ఉన్నారు. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.
1132 మందిలో 275 మందికి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి పోలీసు విశిష్ఠ సేవా(మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 275 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 72 మంది పోలీసు ఉన్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ నుంచి 26, జార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్ నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది ఈ అవార్డులను అందుకోనున్నారు.
ఇక తెలంగాణ నుంచి ఆరుగురు పోలీసులు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 12 మంది పోలీసు విశిష్ఠ సేవ పతకాలను అందుకోనున్నారు. తెలంగాణ అదనపు డీజీపీలు సౌమ్యా మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్‌కు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.