Gujarat Assembly Elections | విధాత: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గుజరాత్‌లో అధికారం చేజిక్కించుకునేందుకు ఆయా పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీకి ఆప్ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వాద్‌నగర్ వాసులు మాత్రం మోదీకే జై కొడుతున్నారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ బీజేపీకే ఓటేస్తామని అక్కడి స్థానికులు స్పష్టం చెబుతున్నారు. మరి వాద్‌నగర్ వాసులు మోదీకే ఎందుకు జై కొడుతున్నారంటే.. మోదీ తన చిన్నతనంలో వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మినట్లు ప్రచారంలో ఉంది. తన తండ్రితో కలిసి మోదీ అక్కడే చాయ్ అమ్మాడని స్థానికులు చెబుతుంటారు.
చాయ్‌వాలా నుంచి ప్రధాని వరకు ఎదిగిన మోదీ.. తనకు బతుకుదెరువు చూపించిన వాద్‌నగర్‌ను మాత్రం మరిచిపోలేదని స్థానికులు చెబుతున్నారు. మోదీ హయాంలోనే వాద్‌నగర్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ను కూడా మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారని స్థానికులు తెలిపారు.
మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ బాగా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ, గుజరాత్‌లో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. కాబట్టి మళ్లీ బీజేపీనే గెలుస్తుందన్న విశ్వాసాన్ని వాద్‌నగర్ వాసులు వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. అనేక హామీలను ఇస్తున్నప్పటికీ గుజరాత్‌లో ఆప్‌కు పట్టు లేదన్నారు. కాంగ్రెస్ కు అసలు బలమే లేదని వాద్‌నగర్ వాసులు స్పష్టం చేశారు.