ఎర్ర‌బెల్లి సోద‌రుల‌కు చుక్కెదురు.. ద‌యాక‌ర్ రావును చిత్తుగా ఓడించిన య‌శ‌స్విని రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనూహ్య ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. వ‌రంగ‌ల్‌లో ఎర్ర‌బెల్లి సోద‌రుల‌కు చుక్కెదురైంది

ఎర్ర‌బెల్లి సోద‌రుల‌కు చుక్కెదురు.. ద‌యాక‌ర్ రావును చిత్తుగా ఓడించిన య‌శ‌స్విని రెడ్డి

విధాత‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనూహ్య ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. వ‌రంగ‌ల్‌లో ఎర్ర‌బెల్లి సోద‌రుల‌కు చుక్కెదురైంది. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు ఇద్ద‌రూ ఓట‌మి పాల‌య్యారు. ఓట‌మి అంటే ఎరుగ‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కాంగ్రెస్ అభ్య‌ర్థి య‌శ‌స్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా సురేఖ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు బీజేపీ త‌ర‌పున పోటీ చేశారు.


ఎర్ర‌బెల్లి రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదీ..


ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు డీలర్ గా తన జీవితాన్ని ప్రారంభించి.. తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. మాస్ లీడర్‌గా ఇప్పటివరకు అపజయం లేకుండా ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు.


తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి 1994లో ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ఎర్రబెల్లి వరదరాయేశ్వరరావుపై విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో సైతం ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ నియోజకవర్గం నుండి వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఎమ్మెల్యే దయాకర్ రావు.


2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో దయాకర్ రావు జనరల్ స్థానమైన పాలకుర్తికి షిఫ్ట్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో సైతం 2009లో టీడీపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. 2014 ఎన్నికలలో సైతం టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా టీఆర్ఎస్‌లో చేరారు.


2018 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గం లో సైతం వరుసగా మూడుసార్లు గెలిచి నాలుగోసారి ఓట‌మి పాల‌య్యారు. 2008 ఉపఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 1994 నుండి 2023 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధిస్తూ ఓటమెరుగని నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు.


ఒక్కసారీ గెలవని సోదరుడు


ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయాల్లో ఓటమిరుగని నేతగా కొనసాగుతుంటే.. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో విజయం సాధించలేక పోతున్నారు. వ్యాపారంలో, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొనసాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజకీయాల్లో రాణించలేక‌పోయారు.


ప్రదీప్ రావు ఒకే పార్టీలో నిలకడగా ఉండరు. 2008 చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బసవరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పీఆర్‌పీలో కొనసాగలేక 2013లో తెలంగాణ నిర్మాణ సమితిలో చేరారు. ఆ పార్టీకి కూడా ప్రజాదరణ లేకపోవడంతో కొద్దీ రోజులకే టీఆర్ఎస్‌లో చేరారు.


2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ప్రదీప్‌రావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే పార్టీ అధిష్టానం తనకు కీలక పదవి కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే నరేందర్‌కు లేదా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు లేదా ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారని భావించిన ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరారు. వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థిగా ప్రదీప్ రావు పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీ ఉన్న వ‌రంగ‌ల్‌ తూర్పులో ప్రదీప్ రావుకు విజ‌యం వ‌రించ‌లేదు.