ఢిల్లీకి వెళ్లేది సూట్కేసులు అందించేందుకే
కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతున్న తీరు గందరగోళంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు

సీఎం, మంత్రుల ఢిల్లీ పర్యటనలపై కిషన్రెడ్డి విసుర్లు
విధాత : కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతున్న తీరు గందరగోళంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గావ్ చలో అభియాన్’ (పల్లెకు పోదాం) కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో స్థానిక డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే ప్రజాధనం ఖర్చుచేస్తూ ఢిల్లీకి వెలుతుండటం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి సూట్ కేసులు అందించేందుకేనని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నిధులు అందించే ప్రయత్నం జరుగుతుందని, కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రజల పాలిట గారడీలుగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫించన్లు, ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంత వరకు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకుంటుందో స్పష్టత లేదని ఆరోపించారు. అప్పులు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తమవంతు కృషి చేస్తామన్నారు.