కాంగ్రెస్ కోరితే 48 గంటల్లోగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ

కాంగ్రెస్ ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్రం 48గంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు

  • Publish Date - January 2, 2024 / 12:15 PM IST
  • కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్‌
  • కాంగ్రెస్‌-బీఆరెస్ మధ్య ఒప్పందం కుదిరిందా అని నిలదీత
  • మార్చి తొలి వారంలోనే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్రం 48గంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపిస్తుందని, సీబీఐ విచారణ కోరేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని, ఖర్చు చేసిన లక్ష కోట్ల రూపాయల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై విచారణకు కాంగ్రెస్ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందా అని కిషన్‌రెడ్డి నిలదీశారు. బీఆరెస్‌, కాంగ్రెస్ ఒక్కటేనని.. అలా కాదంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.


దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా.. లేదా? అని ప్రశ్నించారు. బీఆరెస్‌ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు ఉందని, కాంగ్రెస్, బీఆరెస్‌ డీఎన్ఏ ఒక్కటనే విధంగా ఆ పార్టీల వ్యవహార శైలి ఉందన్నారు. మూడు, నాలుగేళ్లలోనే కట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని, ఇది కేసీఆర్ సర్కారు అవినీతి, కుంభకోణాలకి అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు బీఆరెస్‌కు మేలు చేసే విధంగా సాగుతున్నాయన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉందని, అందుకే బీఆరెస్‌తో అవగాహనకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. మీరు మాజోలికి రావద్దు..మేము మీ జోలికి రాబోమని కాంగ్రెస్‌, బీఆరెస్‌ల మధ్య ఒప్పందం కుదిరిందా అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయవద్దనే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అనుమతి లేకుండా చట్టాన్ని బీఆరెస్‌ తీసుకొచ్చిందని గుర్తు చేశారు.


ప్రస్తుతం కాంగ్రెస్ అయినా అ చట్టాన్ని తీసివేసి దర్యాప్తుకు మార్గం సుగమం చేస్తుందా? లేక బీఆరెస్‌ను కాపాడుతుందా? తేల్చాలన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు మంత్రులు వెళ్లారని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారని, కానీ వారికి ఏం చేయాలో కనీస అవగాహన లేకుండా పోయినట్లు తెలుస్తోందని విమర్శించారు. అసలు కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని ప్రశ్నించారు. కేసీఆర్ కు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారో లేదో తెలియదన్నారు.


మార్చి మొదటి వారంలోపు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..


ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక 50 శాతం పూర్తయిందని చెప్పారు. త్వరలోనే బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటామన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ స్థానంలో ప్రకాశ్‌రెడ్డి టికెట్ ఆశించవచ్చని.. అందులో తప్పేముందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.


ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై త్వరలోనే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో స్టేట్ ఎలక్షన్ టీమ్ సమావేశం జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు జాతీయ స్థాయి నేతలు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండబోదని స్పష్టంచేశారు. నలుగురు సిట్టింగులకు ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఎలాంటి చర్చ అసలు జరగలేదని స్పష్టం చేశారు.


ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగకు టికెట్ అంటూ ఊహాజనిత ప్రచారం సాగుతుందని, అందులో వాస్తవం లేదన్నారు. జిల్లా అధ్యక్షుల మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ ఫోకస్ మొత్తం లోక్ సభ ఎన్నికలపైనే ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని వెల్లడించారు. ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామన్నారు. 50 శాతం లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు ఇప్పటికే అనధికారికంగా ఖరారయార్యరన్నారు.