నల్లమలలో మళ్లీ యురేనియం అన్వేషణ
గత కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ సమీపంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ చర్యలు మళ్లీ కొనసాగుతున్నాయి.

- స్థానికుల్లో ఆందోళన
విధాత, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ సమీపంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ చర్యలు మళ్లీ కొనసాగుతున్నాయి. ఆంధ్ర ప్రాంతంలోని ఓ ప్రైవేట్ విమాన సంస్థకు చెందిన రెండు హెలిక్యాప్టర్లు యురేనియం సర్వేలో భాగంగా నల్లమల్ల కృష్ణ పట్టీలోని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. సంబంధిత అధికారులు చేసే సర్వేకు సంబంధించిన వివరాలు స్థానికులకు తెలువకుండా జాగ్రత్త పడుతున్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గంలో సంచరిస్తూ యురేనియం నమునాలు సేకరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత అణుపరిశోధన సంస్థలకు గతంలో యురేనియం సర్వే బాధ్యతలను అప్పగించింది. అప్పట్లో 2002నుంచి కొనసాగుతున్న సర్వేలో భాగంగా నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి, ముదిగొండ పరిధిలో 200 ఎకరాలు, చందంపేట మండలం చిత్రియాల, పెద్దమునిగల్ గుట్టల్లో 2500 ఎకరాలు, పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం, పెద్దగట్టు పరిసర గ్రామాల్లో 210 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు అప్పట్లో కనుగొన్నారు.
చందంపేట మండలం చిత్రియాల గుట్టల్లో, పెద్దమూల గ్రామంలో 1000 హెక్టార్లు, పీఏపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీభూమి, 196.71ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు గతంలోనే యూసీఐఎల్ అధికారులు నిర్ధారించారు. 25బోర్ల డ్రిల్‌తో సేకరించిన శాంపిల్స్‌లో 21శాంపిల్స్‌లో యురేనియం స్థాయి 2 వేల 168 పీపీబీ ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది.
కాగా 2005లో శేరిపల్లి వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. యురేనియం సర్వే, తవ్వకాలను మొదటి నుంచే ప్రజా సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు కూడా చేశారు. నల్లమల రిజర్వ్ ఫారెస్టు పరిధిలో యురేనీయం నిక్షేపాల వెలికితీత ప్రయత్నాలతో వన్యప్రాణులకు, గిరిజనుల మనుగడకు సమస్యలు ఎదరవుతాయని, కృష్ణా జలాలు కలుషితమవుతాయని వారు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్థానికుల ఆందోళనకు తలొగ్గిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం నిక్షేపాల వెలికితీత ప్రయత్నాలు నిలిపేశాయి. మళ్లీ 2008 నుంచి అణుశక్తి సంస్థ ఖనిజాన్వేషణ మొదలు పెట్టింది. 2014 వరకు ఈ అన్వేషణ కొనసాగింది. ఇవి లభ్యం కావడంతో పెద్దగట్టు, నంబాపురం, కోమటి కుంట తండా ప్రాంతాల్లో డ్రిల్లింగ్ అనుమతుల కోసం అణుశక్తి విభాగం ప్రతిపాదన పంపింది.
నాగార్జున సాగర్ ప్రాంతంలోని నిడ్గుల్ రక్షిత అటవీ ప్రాంతంలోని 7 చదరపు కిలో మీటర్లు, అమ్రాబాద్ టైగర్ రిజర్వాయర్ కు సంబంధించిన 87 చదరపు కిలో మీటర్లలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, సర్వేకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రజల్లో వ్యక్తమైన ఆందోళనలతో నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. కొంతకాలంగా దీనిపై స్తబ్ధతగా ఉన్న కేంద్ర యురేనియం అన్వేషణ సంస్థలు మళ్లీ తమ పనులు చేపట్టడంతో సహజంగానే స్థానికుల్లో ఆందోళన మొదలైంది.