USA
విధాత: పది రోజుల క్రితమే కోటి ఆశలతో అమెరికా(USA)లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు వెళ్లాడు. ఒక ఫ్యూయల్ స్టేషన్‌లో పనికి కుదిరాడు. అది కూడా ఒకటిరెండు వారాల్లో వదిలేసి.. వేరే జాబ్ చూసుకోవాలని అను కున్నాడు. కానీ.. ఈలోపే దోపిడీ దొంగల చేతిలో హత్యకు గురయ్యాడు. ఇది అమెరికా(USA)లో చనిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు సాయేశ్ వీర విషాదాంతం.
అమెరికా(USA)లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు ఫ్యూయల్ స్టేషన్‌లో పనిచేస్తుండగా హత్యకు గురయ్యాడు. ఓహియో రాష్ట్రంలోని కొలంబస్ డివిజన్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నదని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయేశ్ వీర (24)గా గుర్తించారు.
గురువారం తెల్లవారుజామున వెస్ట్‌బోర్డ్ స్ర్టీట్1000 బ్లాక్ వద్ద నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడుతున్న సాయేశ్‌ను కొలంబస్ పోలీసులు గుర్తించారు. సాయేశ్‌ను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించినా ఆయన ప్రాణం నిలువలేదు.
తెల్లవారుజామున 1.27 గంటలకు అతడు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, బాధితుడి బంధువులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయేశ్ స్నేహితుడు రోహిత్ ఎలమంచిలి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఫండ్ రెయిజింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.
పది రోజుల క్రితమే హెచ్1బీ వీసాపై సాయేశ్ అమెరికా(USA) వచ్చాడని, ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడని రోహిత్ తెలిపారు. ఫ్యూయల్ స్టేషన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న సాయేశ్.. ఒకటి రెండు వారాల్లో ఆ జాబ్ మానేయాలనుకున్నాడని, ఈ లోపే ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
సాయేశ్ తండ్రి రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న సాయేశ్.. ఎన్నో కలలతో అమెరికా వచ్చాడని రోహిత్ తెలిపాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి సాయేశ్ అని రోహిత్ చెప్పాడు. మంచి క్రికెటర్ కూడా అని తెలిపాడు. కొలంబస్ ఏరియాలో క్రికెట్ ఆడే చాలా మందికి సాయేశ్ మంచి క్రికెటర్‌గా, మంచి స్నేహితుడిగా తెలుసని చెప్పాడు.