కాల్పనిక జగత్తులో బాలికపై లైంగిక దాడి.. ప్ర‌పంచంలో తొలి కేసు, ద‌ర్యాప్తు

మెటావ‌ర్స్‌లో జ‌రిగిన ఒక అత్యాచారం పై ప్ర‌పంచంలోనే తొలిసారి.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు

  • Publish Date - January 3, 2024 / 10:34 AM IST

విధాత: మెటావ‌ర్స్‌లో జ‌రిగిన ఒక అత్యాచారం పై ప్ర‌పంచంలోనే తొలిసారి.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. వ‌ర్చువ‌ల్ రియాలిటీ (Virtual Reality) ప్ర‌పంచానికే మెటావ‌ర్స్ అని పేరు. ఇందులో నేరుగా మ‌నం క‌నిపించ‌న‌ప్ప‌టికీ మ‌న‌కు ప్ర‌తిబింబ‌మైన ఒక రూపం క‌నిపిస్తుంది. దీనినే అవ‌తార్ అని పిలుస్తారు. ఇలా యూకే (UK) కు చెందిన ఒక 16 ఏళ్ల అమ్మాయి త‌న అవ‌తార్‌తో మెటావ‌ర్స్‌లోకి వెళ్ల‌గా.. గుర్తుతెలియ‌న వ్య‌క్తులు త‌మ అవ‌తార్‌ల‌తో అత్యాచారానికి య‌త్నించార‌నేది ఆ బాలిక ఆరోప‌ణ‌. త‌న అవ‌తార్‌పై జ‌రిగిన అత్యాచారయ‌త్నం… త‌న‌పై జ‌రిగిన‌ట్టుగానే భావించాల‌ని ఆమె ఫిర్యాదులో పేర్కంది. ఈ ఘ‌ట‌న వ‌ల్ల త‌న‌కు భౌతికంగా ఏమీ కాన‌ప్ప‌టికీ మాన‌సికంగా ఎంతో వేద‌న‌ను అనుభ‌వించాన‌ని పేర్కొన్నారు.


ఒవ వ‌ర్చువ‌ల్ రియాలిటీ గేమ్‌లో ఆడుతున్న‌పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం పేర్కొంది. త‌మ‌కు తెలిసున్నంత వ‌ర‌కు ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేయ‌డం, ద‌ర్యాప్తు ప్రారంభించ‌డం ఇదే తొలిసార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం బాధితురాలు షాక్‌లోనే ఉంద‌ని.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అవ‌తార్ సంబంధితుల‌ను క‌నుగొనే ప‌నిలో ఉన్నామ‌ని వారు పేర్కొన్నారు. అయితే వారిని ఎలా శిక్షించాలి.. కోర్టు ముందు ఎలా ప్ర‌వేశ‌పెట్టాల‌నే దానిపై స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌స్తుత చ‌ట్టాలు మెటావ‌ర్స్ ప్ర‌పంచానికి అన్వ‌యం చెంద‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం.


ఒక‌వైపు నిజ‌మైన ప్ర‌పంచంలో జ‌రుగుతున్న అత్యాచార కేసుల్లోనే పురోగ‌తి క‌నిపించ‌క సంఖ్య పెరిగిపోతూ ఉండ‌గా.. ఊహాప్ర‌పంచంలో అత్యాచార కేసుల‌ను ఎలా ప‌రిష్క‌రిస్తామ‌ని కొంత మంది అధికారులు వాపోయారు. అయితే వ‌ర్చువ‌ల్ అత్యాచార య‌త్నంపై కేసు న‌మోదు చేయ‌డాన్ని యూకే హోం మంత్రి జేమ్స్ క్లేవ‌ర్లీ స‌మ‌ర్థించారు. రేప్ ఊహాజ‌నిత‌మైనా బాలిక ఎదుర్కొన్న మాన‌సిక వేద‌న భౌతిక‌మైన‌దేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ‘ఈ అత్యాచారం నిజ‌మైన‌ది కాద‌ని చెప్ప‌డం సులువే.


అయితే మ‌న ప్ర‌పంచాన్ని మ‌రింత వాస్త‌విక‌తతో చూపించాల‌ని చేసేదే వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచం. అలాంట‌ప్పుడు అది అబ‌ద్ధం ఎలా అవుతుంది’ అని ప్ర‌శ్నించారు. దీనిపై మెటా స్పందించింది. హారిజ‌న్ వ‌ర‌ల్డ్స్ అనే వ‌ర్చువ‌ల్ గేమ్ ఆడుతున్న యూజ‌ర్ల ద్వారా ఇలాంటి కేసులు త‌మ దృష్టికి వ‌స్తున్నాయ‌ని పేర్కొంది. ఇలాంటి వాటికి త‌మ వేదిక‌పై చోటు లేద‌ని స్ప‌ష్టం చేసింది. అందుకే వ‌ర్చువ‌ల్ ప్ర‌పంచంలో కూడా ఎవ‌రికి వారు హ‌ద్దుల‌ను పెట్టుకోవాల‌ని… తెలియ‌ని వారికి ఆమ‌డ దూరంలో ఉండాల‌ని సూచించింది.

Latest News