Nalgonda: ఓటరు నమోదును విజయవంతం చేయాలి: కలెక్టర్

విధాత: ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యల విజయవంతానికి యువత, ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కోరారు. జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటర్ నమోదు, తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువ‌త ఓట‌రు […]

  • Publish Date - November 27, 2022 / 10:01 AM IST

విధాత: ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యల విజయవంతానికి యువత, ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కోరారు. జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటర్ నమోదు, తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువ‌త ఓట‌రు న‌మోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్ జాబితా ప్రతి మూడు నెలలకు ఒకసారి అప్ డేట్ అవుతుందన్నారు.

ప్రజాప్రతినిధులు 18 సంవ‌త్స‌రాలు నిండిన యువ‌త ఓట‌రు న‌మోదు చేసుకునేలా వారిలో చైత‌న్యం తీసుకురావాల‌ని కోరారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలనే లక్ష్యంతో పాటు, ఓటు హక్కు వినియోగంలో అవకతవకలు అరికట్టడంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించిందని తెలిపారు.

NVSP పోర్టల్ ద్వారా, ఓటర్ హెల్ప్ లైన్ ఆప్ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫారం 6-బి ద్వారా వంద శాతం ఓటర్లు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాల‌ని సూచించారు. అలాగే అర్హులైన యువత నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ముందుకు రావాల‌ని కోరారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన, పెళ్లై వెళ్లిపోయిన, డూప్లికేట్ కార్డు ఓటర్ల తొలగింపులో ప్రజాప్రతినిధులు సహకరించాల‌ని ఆయన కోరారు.

ఓటర్ నమోదు కార్యక్రమాన్నిఅన్ని పోలింగ్ స్టేషన్ లలో శనివారం నిర్వహించామ‌ని, అలాగే ఆదివారం కూడా కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని, బీఎల్ ఓలు అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. ముందే ఓట‌ర్ కార్డు ఉన్న‌ వాళ్లు ఏమైనా మార్పులు, చేర్పులు, సవరణలు, తొలగింపుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డిసెంబర్ 3,4 న కూడా పోలింగ్ బూత్ లలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ నమోదు కార్యక్రమానికి సహకరించాలని, ఓటర్ నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలని కోరారు.

అనంతరం ఓటర్ జాబితాలో నమోదుకు, మార్పులు, చేర్పులకు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5న తుది జాబితా విడుదల చేయ‌నున్న‌ట్టు కలెక్టర్ తెలిపారు. సమావేశం లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి, ఎన్నికల డీటీ విజయ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.