అలనాటి అందాల న‌టి.. వ‌హీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం

  • By: krs    latest    Sep 26, 2023 8:55 AM IST
అలనాటి అందాల న‌టి.. వ‌హీదా రెహ్మాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం

బాలీవుడ్ లెజెండ్ వహీదా రెహ్మాన్ (Waheeda Rehman) ను ప్ర‌తిష్ఠాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. 2021 సంవ‌త్స‌రానికి గానూ ఆమెకు ఈ అవార్డును అందించ‌నున్నారు. ఈ మేర‌కు స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. గుయ్‌డే, ప్యాసా, కాగ‌జ్ కే ఫూల్‌, చౌద్విన్ కా చాంద్ త‌దిత‌ర చిత్రాల్లో ఆమె న‌ట‌నకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ‘వ‌హీదా రెహ్మాన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయ‌డం నాకు ఎంతో గ‌ర్వంగానూ, ఆనందంగానూ ఉంది. భార‌తీయ సినిమాకు ఆవిడ చేసిన సేవ‌కు గుర్తుగా దాదా సాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) జీవిత సాఫల్య పుర‌స్కారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌దానం చేస్తుంది.

హిందీ సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆవిడ ప్ర‌త్యేక ముద్ర వేశారు’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. సుమారు అయిదు సంవ‌త్స‌రాల ఆవిడ న‌ట జీవితంలో ఎన్నో గొప్ప, చ‌రిత్ర‌లో నిలిచిపోయే పాత్ర‌ల‌ను వ‌హీదా పోషించారు. రేష్మ అండ్ షేరా అనే చిత్రానికి గానూ ఆవిడ న‌ట‌న‌కు జాతీయ అవార్డు సైతం ద‌క్కింది. అంతేకాకుండా ఆవిడ‌కు 1972లో ప‌ద్మ‌శ్రీ, 2011లో ప‌ద్మ భూషణ్ అవార్డుల‌ను ప్ర‌దానం చేసి భార‌త ప్ర‌భుత్వం గౌర‌వించింది.

సినిమా జీవితం అనంత‌రం త‌న జీవితాన్ని సేవ‌కు, స‌మాజానికి వ‌హీదా త‌న పూర్తి స‌మ‌యాన్ని కేటాయించారు. వ్య‌క్తిగ‌త జీవితంలో న‌టుడు రెహ్మాన్‌తో చ‌నువుగా ఉంటూ ఆయ‌న‌తో ఎక్కువ సినిమాలు క‌లిసి న‌టించారు. అనంత‌రం 1974లో క‌వ‌ల్‌జీత్‌ను వివాహ‌మాడారు. వ‌హీదా తెలుగులోనూ కొన్ని సినిమాల్లో న‌టించారు. రోజులు మారాయి (1955), చుక్కల్లో చంద్రుడు (1980), బంగారు క‌ల‌లు (1974), సిద్ధార్థ్ న‌టించిన చుక్క‌ల్లో చంద్రుడు (2006)లోనూ ఆమె తెలుగు తెర‌పై క‌నిపించారు.