Warangal | ‘చల్లా’ ఇలాఖాలో కొత్తలొల్లి.. పాత కొత్తల మధ్య భగ్గుమన్న విభేదాలు
Warangal బీఆర్ఎస్ నుంచి గజ్జి విష్ణు, సందెల సునీల్ బహిష్కరణ ఎమ్మెల్యే చల్లా పై ఉద్యమకారుల ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా గులాబీ పార్టీలోని ఉద్యమకారులు నిరసన గొంతెత్తారు. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంగా సొంత పార్టీలో రాజకీయ వేడి రగులుతోంది. ఉద్యమకారులు వర్సెస్ వలసవాదులు అంటూ ప్రారంభమైన విభేదాలు, పరస్పర దూషణలు, సవాళ్ళతో బజారున పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న […]

Warangal
- బీఆర్ఎస్ నుంచి గజ్జి విష్ణు, సందెల సునీల్ బహిష్కరణ
- ఎమ్మెల్యే చల్లా పై ఉద్యమకారుల ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా గులాబీ పార్టీలోని ఉద్యమకారులు నిరసన గొంతెత్తారు. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంగా సొంత పార్టీలో రాజకీయ వేడి రగులుతోంది. ఉద్యమకారులు వర్సెస్ వలసవాదులు అంటూ ప్రారంభమైన విభేదాలు, పరస్పర దూషణలు, సవాళ్ళతో బజారున పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరకాల గులాబీ రాజకీయాల్లో ఈ కొత్త చిచ్చు పుట్టింది.
ఇద్దరు ఉద్యమకారులపై వేటు
వివాదం ముదిరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉద్యమకారులైన ఇద్దరు నాయకులను పార్టీ నుంచి బహిష్కరణకు దారి తీశాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆత్మకూరు మండలం గూడెప్పాడు మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు, గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన సందెల సునీల్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ వరంగల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం ప్రకటించారు. ఈ ఇరువురి నాయకుల బహిష్కరణ అనంతరం ఉద్యమకారులు ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడంతో పరకాలలో రాజకీయ వేడి పెరిగింది.
బహిష్కరణ పై ఉద్యమకారుల నిరసనలు
పరకాలలో తమకు గుర్తింపు లేదని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు నాయకులను బహిష్కరించడం పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. దీంతో ఉద్యమంలో పాల్గొన్న వీరంతా ధర్మారెడ్డి తీరుకు వ్యతిరేకంగా రగిలిపోతున్నారు. వీరికి మద్దతుగా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నాయకులు కూడా రంగంలోకి దిగారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బహిష్కరణకు నిరసనగా గీసుకొండలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రత్యర్థి పార్టీల కంటే, సొంత పార్టీ నుంచి ధర్మారెడ్డి ఇబ్బందులు ఎదుర్కోవడం ఇక్కడ గమనార్హం.
తొలినుంచి పరకాలలో విభేదాలు
పరకాల నియోజకవర్గంలో తొలినుంచి ఉద్యమకారులు వలసవాదుల మధ్య విభేదాలు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందే ఈ సమస్యపై ఉద్యమకారులు గొంతు విప్పారు. ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వైయస్సార్సీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే కొండా సురేఖ రాజీనామాతో ఉప ఎన్నికలు వచ్చాయి.
ఎన్నికల్లో కొండా సురేఖ పై టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ములుగురు బిక్షపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ వచ్చేనాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బిక్షపతిని కాదని న్యాయవాది ముద్దసాని సహోదరు రెడ్డికి పరకాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సహోదరు రెడ్డి ఓడిపోయి, టిడిపి నుంచి పోటీ చేసిన చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు.
ఎన్నికల్లో గెలిచిన అనంతరం చల్లా ధర్మారెడ్డి టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ధర్మారెడ్డి గెలుపొందారు. 2014 ధర్మారెడ్డి టిఆర్ఎస్ లో చేరినప్పటినుంచి తమను పట్టించుకోవడంలేదని పాత టిఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బహిరంగ సమావేశాలు నిర్వహించి ధర్మారెడ్డి తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ఈ దఫా కూడా ఉద్యమకారులకు పరకాల నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుందని గజ్జి విష్ణు, సందెల సునీల్ తదితరులు గొంతు విప్పారు. దీన్ని సహించలేని ఎమ్మెల్యే ధర్మారెడ్డి వీరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించేశారు. దీంతో ఉద్యమకారులు మరింత ఆందోళనకు లోనై ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.
ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి పరకాలలో తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ధర్మారెడ్డికి తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరిస్తున్నారు. సొంత పార్టీలోనే పాత, కొత్తల మధ్య విభేదాలు తలెత్తడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని చర్చ సాగుతోంది.
ఎన్నికల సమయంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోవడం చల్లా ధర్మారెడ్డికి కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. ఇదిలా ఉండగా వీలైనంత మేరకు తాను ఉద్యమకారులను కలుపుకునే పోతున్నానని ధర్మారెడ్డి చెబుతున్నారు.