Warangal |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యపై బీజేపీ చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ సిద్ధమైంది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
ఇరువర్గాలు జెండా కర్రలతో దాడులకు సిద్ధమయ్యారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ సంఘటనలో ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయి. తోపులాటలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్పృహ తప్పి కింద పడిపోయారు.
ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరింత గట్టి చర్యలు తీసుకున్నారు.