తనను సీఎం చేయాలన్న హరీశ్‌రావు మాటల వెనుక ఆంతర్యం ?
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా నల్లగొండ సభలో కేసీఆర్ కాఫర్ డ్యాం కట్టి నీళ్లు ఎత్తిపోయవచ్చు అన్న మాటలపై సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా నల్లగొండ సభలో కేసీఆర్ కాఫర్ డ్యాం కట్టి నీళ్లు ఎత్తిపోయవచ్చు అన్న మాటలపై సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. మేడిగడ్డ నుంచి అన్నారం అక్కడి నుంచి సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోస్తే ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని సాంకేతిక అంశాలను ముందుపెట్టే ప్రయత్నం చేశారు.
మరమ్మతులు పూర్తికాకుండా నీళ్లు నింపడం సాధ్యం కాదని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. కానీ కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు తమ వైఫల్యాన్ని అంగీకరించకుండా, రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించాలని కొత్త పల్లవి ఎత్తుకోవడమే విచిత్రంగా ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సీఎం రేవంత్ దీనిపై స్పందిస్తూ నీళ్ల మంత్రులుగా పనిచేసిన మీకే బాధ్యత అప్పగిస్తామని అన్నారు.
దీనికి సమాధానం చెప్పాల్సిన హరీశ్.. ఎదురు సవాలు విసురుతూ రేవంత్‌రెడ్డికి చేతకాకపోతే వైదొలిగి తనకు సీఎం బాధ్యతలు అప్పగిస్తే వాళ్లు చెప్పిన పనులన్నీ చూపిస్తానని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక్కరోజు సీఎంగా బాధ్యతలు తీసుకోవడం అనుకుంటున్నారా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై రాజకీయం చేస్తున్నారని అనడమూ సరికాదన్న అభిప్రాయాల వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రూ.90 వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేసిన ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు వెలుగులోకి వస్తే గత ప్రభుత్వ బాధ్యులుగా బాధ్యతగా ఉండాలి. కానీ ఎదురుదాడి చేయడం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడమేనంటున్నారు. అలాగే బీఆర్ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నవాళ్లు మొన్నటిదాకా మౌనంగా ఉన్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులకు ధైర్యం ఇవ్వడానికి, నేతలను కాపాడుకోవడానికే నల్గొండలో కేసీఆర్ సభ పెట్టారన్న వాదన వినిపిస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం స్వల్పకాలంలోనే పూర్తికావడానికి తాను పడిన కష్టం గురించి గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ అదే విషయంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే పాల్గొనకుండా ఉండటం దేనికి సంకేతం అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ తర్వాత ఆ స్థానం కేటీఆర్ అన్నది బహిరంగ రహస్యమే. రెండేళ్ల కిందటే ఆయనను సీఎం చేస్తారని వార్తలు వచ్చాయి. దానికి బలం చేకూర్చేలా తలసాని మొదలు చాలామంది మంత్రులు కేటీఆర్‌కు ఆ సామర్థ్యం ఉన్నదని కితాబు కూడా ఇచ్చారు. ప్రధాని కూడా కేసీఆర్ తన తనయుడిని సీఎం చేయడానికి సాయం చేయాలని కోరారని హైదరాబాద్ పర్యటనలో చెప్పారు.
అందుకే పార్టీలో ఎంత కష్టపడినా హరీశ్‌రావుకు ప్రయోజనం ఉండదని అందుకే పార్టీ మారాలని అధికారపార్టీ నేతల నుంచి ఆఫర్లు వస్తున్నాయి అంటున్నారు. నేతలు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు మారుతాయనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.
కానీ ఎన్నికలకు ముందే అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతల మాటలు చూస్తుంటే ఏదో జరుగుతున్నదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్లో చీలిక వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నదా? బీజేపీ కూడా సమయం కోసం వేచి చూస్తున్నదా? హరీశ్‌రావు మాటల ఆంతర్యం అదే కావొచ్చు అనే చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్నది.