విధాత : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30 తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు వాతావరణం మారిపోయింది. ఓటర్ల మనోగతం ఏమిటో ఏ పార్టీకీ అంతుపట్టడం లేదు. మూడు ప్రధాన పార్టీలు కనిపిస్తున్నా పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆరెస్ మధ్యే ఉంటుందని అనేక సర్వేలు పేర్కొంటున్నాయి. షెడ్యూల్ విడుదలైన రోజు, ఎన్నికల రోజుతో కలిపితే ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉన్నది. అప్పుడే ఏ పార్టీకి ఎన్నిసీట్లు రావొచ్చు? అన్న చర్చలు మొదలయ్యాయి. గెలుపు మాదంటే కాదు.. మాదేంటున పార్టీల వాదనలు ఎలా ఉన్నా.. సగటు జనాల అభిప్రాయం, క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పార్టీల బలాలు, బలహీనతలు ఇలా ఉన్నాయి.
బీఆరెస్
రెండుసార్లు గెలిచిన బీఆరెస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది. తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతి కంటే రెండోసారి ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారనున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌లో నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా నిరుద్యోగులు చాలా నష్టపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. సీఎం అసెంబ్లీ వేదికగా 80 ఉద్యోగాల ప్రకటన ఏడాదిన్నరకాలం దాటినా పూర్తికాలేదు. సీఎం రేపే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న ప్రకటన.. వట్టి ప్రకటనగానే మిగిలిపోయింది.
దీనికితోడు ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు కావడం, నియామక ప్రక్రియలో లోపాల వల్ల వివిధ నోటిఫికేషన్ల అంశం కోర్టుల పరిధిలోకి వెళ్లింది. అవి ఎప్పుడు తేలుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నియామకాలు జూమ్లాగా మారిపోయాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ధరణితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పెద్ద సంఖ్యలో రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసా…గుతూనే ఉన్నది.
కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు అందజేయలేని పరిస్థితి. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు తమను గట్టెక్కిస్తాయని, కాళేశ్వరంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించడం, మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరణతో భూగర్భజలాలు పెరగడం తమ విజయాలుగా ప్రభుత్వం చెప్పుకొంటున్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయంటున్న అధికారపార్టీ నేతలు వందసీట్లు గ్యారెంటీ అన్న ధీమాతో ఉన్నారు. అయితే.. టికెట్ల విషయంలో నేతల కుమ్ములాటలు మరో సమస్యగా ఉన్నాయి.
కాంగ్రెస్:
కర్ణాటక ఫలితాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. విజయభేరి సభ వేదికగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని కలిగించాయి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి ఇవి చాలా దోహదపడుతాయని ఆ పార్టీ భావిస్తున్నది. ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరు చేయడం, నిరుద్యోగ, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయడంతో పార్టీ గ్రాఫ్ చాలా పెరిగింది. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దృఢ సంకల్పంతో జాతీయ నాయకత్వం ఉన్నది.
దానికి అనుగుణంగా పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. నేతల మధ్య విభేదాలను పక్కనపెట్టి రెండు నెలలు కష్టపడితే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలే తెలంగాణలో పునరావృతం అవుతాయని హితబోధ చేసింది. దీనిని కాంగ్రెస్ నేతలు తలకెక్కించుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీతో కలిసి పనిచేయడానికి వామపక్షాలు, జనసమితి లాంటి పార్టీలు కూడా ముందుకు రావడం శుభపరిణామమని ప్రజల్లోనూ చర్చ జరుగుతున్నది.
బీజేపీ
బీఆరెస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోవడమే గానీ.. బీజేపీకి సరైన కార్యాచరణ లేదన్నది పరిశీలకుల అభిప్రాయంగా ఉన్నది. తెలంగాణలో ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో రాష్ట్ర నేతలెవరూ కచ్చితమైన కారణాలు చెప్పలేకపోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని చెప్పడం, వివిధ సందర్భాల్లో తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని చెప్పినా ప్రజలు వాటిని ఎంత మేరకు పరిగణనలోకి తీసుకుంటారో వేచి చూడాల్సిందే. తెలంగాణకు వచ్చిన జాతీయ నేతలు, ఇక్కడ ఉండే రాష్ట్ర నేతలు ఎంతసేపూ ఎంఐఎంను బూచిగా చూపెట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి.. తెలంగాణకు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉన్నది.
ప్రధాని కూడా మొన్న రాష్ట్రానికి ప్రకటించిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్టు సమాచారం. కొత్తవి ప్రకటించకుండా తొమ్మిదేళ్ల కిందటి విభజన హామీ, నాలుగున్నరేళ్ల కిందట పార్టీ ఎంపీ ఇచ్చిన హామీని ప్రధాని ఇప్పుడు ప్రకటిస్తే ఒరిగే లాభం ఏంటని సొంత నేతలే పెదవి విరిస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదనే వాదన కూడా ఉన్నది.
అక్కడ బీజేపీ.. నేరుగా కాంగ్రెస్‌తోనే తలపడుతున్నది. అక్కడ కాంగ్రెస్‌కే అనుకూలతలు ఎక్కువగా ఉండటంతోనే అక్కడే సర్వశక్తులు ఒడ్డేందుకు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. కేంద్రమే తెలంగాణను లైట్‌గా తీసుకోవడంతో రాష్ట్ర నాయకత్వం కూడా డీలాపడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన ఆ పార్టీ ఈసారి డబుల్ డిజిట్ సీట్లు అయినా దక్కించుకుంటుందని గట్టిగా చెప్పడం లేదు.