స్వాగ‌తిస్తున్నారు స‌రే.. BRSతో క‌లిసి వ‌చ్చే వారెవ‌రు?

ఉన్నమాట: కేసీఆర్ ప్ర‌క‌టించిన జాతీయ పార్టీ భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)ని దేశంలోని చాలా ప్రాంతీయ, జాతీయ‌ పార్టీల నేత‌లు స్వాగ‌తిస్తున్నారు. అయితే ఆయ‌న‌తో క‌లిసి వ‌చ్చేవారెవ‌రు? అనే సందిగ్ధం కొన‌సాగుతున్న‌ది. ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలు సొంతంగానో, కాంగ్రెస్‌తోనో, బీజేపీతోనో లేదా ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొన‌సాగుతున్నాయి. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌ను, బీజేపీని కాద‌ని కేసీఆర్‌తో క‌లిసి వ‌చ్చే పార్టీలు, నేత‌లు ఎంత‌మంది అనేది స్ప‌ష్టం కావ‌డం లేదు. భార‌త్ […]

  • By: Somu    latest    Oct 08, 2022 10:31 AM IST
స్వాగ‌తిస్తున్నారు స‌రే.. BRSతో క‌లిసి వ‌చ్చే వారెవ‌రు?

ఉన్నమాట: కేసీఆర్ ప్ర‌క‌టించిన జాతీయ పార్టీ భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌)ని దేశంలోని చాలా ప్రాంతీయ, జాతీయ‌ పార్టీల నేత‌లు స్వాగ‌తిస్తున్నారు. అయితే ఆయ‌న‌తో క‌లిసి వ‌చ్చేవారెవ‌రు? అనే సందిగ్ధం కొన‌సాగుతున్న‌ది. ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలు సొంతంగానో, కాంగ్రెస్‌తోనో, బీజేపీతోనో లేదా ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో కొన‌సాగుతున్నాయి.

ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌ను, బీజేపీని కాద‌ని కేసీఆర్‌తో క‌లిసి వ‌చ్చే పార్టీలు, నేత‌లు ఎంత‌మంది అనేది స్ప‌ష్టం కావ‌డం లేదు. భార‌త్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న‌ది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ముఖాముఖిగా త‌ల‌ప‌డే రాష్ట్రాల‌లో క‌ర్ణాట‌క‌తో పాటు త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌, హ‌ర్యానా రాష్ట్రాలున్నాయి.

క‌ర్ణాట‌క‌లో జ‌న‌తాద‌ళ్ సెక్యూల‌ర్ పార్టీ కాంగ్రెస్‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ త‌ర్వాత ఆ రాష్ట్రంలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో కుమార‌స్వామి గ‌ద్దె దిగాల్సి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆయ‌న కాంగ్రెస్ పార్టీతో అంటీముట్ట‌న‌ట్టే ఉన్నారు. అలాగే డీకే శివ‌కుమార్ ఆ రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడైన త‌ర్వాత ఆయ‌న బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై ఈడీ, ఐటీ దాడులు జ‌రుగుతున్నా ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

క‌ర్ణాట‌క‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా క‌మ‌లం పార్టీకి షాక్ త‌ప్ప‌దంటున్నారు. అందుకే అక్క‌డ య‌డ్యూర‌ప్ప‌ను మార్చి బ‌స‌వ‌రాజు బొమ్మైని సీఎం చేసినా బీజేపీ తిరిగి అధికారంలోకి వ‌స్తామనే న‌మ్మ‌కం లేదు. అందుకే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొవాలంటే ఆ రాష్ట్రంలో ప్రాబ‌ల్య వ‌ర్గ‌మైన లింగాయ‌త్ వ‌ర్గానికి చెందిన బీఎస్ య‌డ్యూర‌ప్ప‌నే ఆ పార్టీ అధిష్ఠానం న‌మ్ముకున్న‌ది. ఆ పార్టీ సిద్ధాంతాన్ని ప‌క్క‌న పెట్టి 75 పైబ‌డిన య‌డ్యూర‌ప్ప‌కు పార్ల‌మెంట‌రీ బోర్డులో స్థానం క‌ల్పించిందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌ది. అందుకే కుమార‌స్వామి లాంటి నేత‌లు కేసీఆర్ తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌ప‌డుతుండ‌వ‌చ్చు.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌టనకు వివిధ ప్రాంతీయ పార్టీల నేత‌లు ఆహ్వానించారు. అయితే రాజ‌కీయ కార‌ణాల‌తో వారు రాలేదు. అందులో యూపీలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో కేసీఆర్ ప‌లు ద‌ఫాలు చ‌ర్చించినా ఆయ‌న జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప‌క్క‌న‌పెట్టడం సాధ్యం కాద‌ని ఇప్ప‌టికే అనేక‌సార్లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. తేజ్వ‌సీ యాద‌వ్‌ను ఆహ్వానించినా హాజ‌రుకాలేదు. బీహార్‌లో ఆర్జేడీ కూడా తాజాగా జేడీయూ, కాంగ్రెస్‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కేసీఆర్‌తో వేదిక పంచుకోవ‌డం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. కాబ‌ట్టి తేజ్వ‌సీ కేసీఆర్‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు కానీ రాలేదు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా కాంగ్రెస్‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయ‌న‌దీ అఖిలేశ్, తేజ్వ‌సీల వైఖ‌రే. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్‌, శివ‌సేన లాంటి పార్టీలు కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి ఆహ్వానించాయి. అంతేగాని కాంగ్రెస్ లేకుండా బీజేపీని క‌ట్ట‌డం చేయ‌డం కుద‌ర‌ద‌ని క‌రాఖండిగా చెప్పాయి. కేజ్రీవాల్‌, మ‌మ‌తా బెన‌ర్జీలు వాళ్ల పార్టీల‌ను విస్త‌రించే ప‌నిలో ఉన్నాయి.

ఏపీలో వైసీసీ, టీడీపీలు బీఆర్ఎస్‌పై సెట‌ర్లు వేస్తున్నాయి. ఒడిషా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఆయ‌న సొంత రాష్ట్రం గురించి త‌ప్పా జాతీయ రాజ‌కీయాల గురించి గానీ, ఇత‌ర పార్టీల గురించి ఆలోచించ‌డం లేదు. వామ‌ప‌క్షాలు మొద‌టి నుంచి మ‌త‌త‌త్వ పార్టీ అయిన బీజేపీ వ్య‌తిరేకంగా ఎవ‌రూ పోరాడినా వారికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇట్లా వివిధ ప్రాంతీయ పార్టీల నేత‌లు మ‌ద్ద‌తు, సంఘీభావానికే ప‌రిమితం కాగా, మ‌రికొంత మంది నేత‌లు వివిధ రాజ‌కీయ‌ కార‌ణాల‌తో కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌నను స్వాగ‌తించారు కానీ ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌ని హామీ గాని, సంకేతాలు గాని ఇవ్వ‌లేదు.