బిల్వ పత్రం అంటే మహాదేవుడికి ఎందుకంత ఇష్టం? బిల్వస్తోత్రం పఠిస్తే…
విధాత: బిల్వ పత్రాన్నే మారేడు దళం అని కూడా అంటారు. హిందూ ధర్మంలో బిల్వ పత్రానిది మహోన్నత స్థానం. మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైంది. బిల్వ దళంలోని మూడు ఆకులు సత్త్వ, రజ, తమో గుణాలు, ముక్కంటేశ్వరుడి మూడు నేత్రాలకు ప్రతీక. మహాదేవుడి ఆయుధం త్రిశూలంనకు సంకేతం. త్రిదళ బిల్వ పత్రంలోని మూడు ఆకుల్లో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కుడి వైపున విష్ణువు, ఎడమ వైపున బ్రహ్మ మధ్యలో శివుడు కొలువై ఉంటారట. బిల్వ పత్రాలను సోమ, మంగళ, […]

విధాత: బిల్వ పత్రాన్నే మారేడు దళం అని కూడా అంటారు. హిందూ ధర్మంలో బిల్వ పత్రానిది మహోన్నత స్థానం. మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైంది. బిల్వ దళంలోని మూడు ఆకులు సత్త్వ, రజ, తమో గుణాలు, ముక్కంటేశ్వరుడి మూడు నేత్రాలకు ప్రతీక. మహాదేవుడి ఆయుధం త్రిశూలంనకు సంకేతం.
త్రిదళ బిల్వ పత్రంలోని మూడు ఆకుల్లో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కుడి వైపున విష్ణువు, ఎడమ వైపున బ్రహ్మ మధ్యలో శివుడు కొలువై ఉంటారట. బిల్వ పత్రాలను సోమ, మంగళ, శుక్రవారాల్లో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయంలో కోయరాదు. పూజలో మాత్రం తప్పనిసరిగా మూడు ఆకులు ఉన్న బిల్వదళాన్ని మాత్రమే ఉపయోగించాలి.
బిల్వ స్తోత్రం..
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం
రామలింగ ప్రతిష్ఠాచ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వ పత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం
ఉమయా సహదేవేశ నంది వాహనమేవచ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం
సాలగ్రమేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్ణకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యత్
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం
బిల్వ స్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం
బిల్వ స్తోత్ర భావం..
- మూడు గుణాలను ఆకారముగా ధరించిన నిరాకారుడు.. మూడు నేత్రాలు కలవాడు.. త్రిశూలము ఆయుధముగా కలవాడు.. మూడు జన్మలలోని పాపాలను హరించి వేసే శివుడికి మూడు ఆకులు గల బిల్వ పత్రాన్ని భక్తితో సమర్పిస్తున్నాను..
- ఓ మహాదేవా చీలికలు లేని, కోమలమైన, శుభప్రదమైన మూడు శాఖలు గల బిల్వ పత్రముతో నిన్ను పూజిస్తున్నాను.
- కోటి కన్యాదానములు, కోటి తిలపర్వతములను, బంగారు కొండను దానమిస్తే ఎలాంటి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రాన్ని శివుడికి అర్పించుచున్నాను.
- కాశీ క్షేత్రము నందు నివాసము, కాలభైరవుని దర్శనము, ప్రయాగ క్షేత్రమున మాధవుని దర్శనం చేసుకుంటే ఏ ఫలితము పొందుతామో అలాంటి ఫలితమును ఇచ్చే ఒక్క బిల్వ పత్రము శివుడికి సమర్పిస్తున్నాను.
- ప్రతీ సోమవారం ఉపవాస వ్రతమాచరించి, రాత్రి హోమము చేస్తే ఎటువంటి ఫలితము కలుగునో అలాంటి ఫలితానిచ్చే ఒక్క బిల్వపత్రము శివుడికి సమర్పించి అర్చించుచున్నాను.
- రామలింగ ప్రతిష్ట, వివాహమును నిర్వహించుట, ఎన్నో తటాకములు త్రవ్వించుట, పుత్ర సంతతి కలిగి యుండుట వలన ఎలాంటి పుణ్యము కలుగునో అలాంటి పుణ్య ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రము శివుడికి అర్చించుచున్నాను.
- శివ సహస్రనామ పఠనముతో శివుడిని అర్చించడం వలన ఎట్టి ఫలము లభిస్తుందో అట్టి ఫలము లభించే ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి అర్చించుచున్నాను.
- దివాహనుడు, పార్వతీ సమేతుడు, భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి బిల్వదళమును సమర్పించుచున్నాను.
- బ్రాహ్మణులకు సాలగ్రామాలు దానం చేయుట, పదికోట్ల తటాకములు త్రవ్వించుట, వేల కోట్ల యజ్ఞములు చేయడం వల్ల ఎలాంటి ఫలితము కలుగునో అలాంటి ఫలమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివుడికి అర్చించుచున్నాను.
- అశ్వమేధముతో పాటు నూరు యజ్ఞములు చేసి, వేల కోట్ల ఏనుగులను దానమిచ్చుట, కోటి మంది కన్యలను దానము చేయడం వల్ల ఎలాంటి ఫలతము కలుగునో అలాంటి ఫలితమునిచ్చే ఒక్క బిల్వ పత్రమును శివుడికి అర్చించుచున్నాను.
- బిల్వదళమును దర్శించినంత మాత్రాన్నే పుణ్యము కలుగును, దానిని తాకినా పాపము నశించును. ఘోర పాపాలను నశింపజేసే బిల్వదళమును శివునికి అర్చించుచున్నాను.
- బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠాలను వేలసార్లు పఠించుట వలన ఎలాంటి పుణ్యం కలుగునో అలాంటి పుణ్యమునిచ్చు ఒక్క బిల్వ పత్రమును శివుడికి అర్చించుచున్నాను.
- వేలాది మందికి అన్నదానము, వేయి ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలమునిచ్చు బిల్వపత్రము శివునికి అర్చించుచున్నాను. కావున నేను అనేక జన్మలలో చేసిన పాపము నశించును
- అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వ స్తోత్రాన్ని పఠించినవారికి శివలోకము ప్రాప్తించును.