గుత్తాకు ఉలికిపాటు ఎందుకు..!

రాజకీయ విమర్శలపై ప్రత్యర్థుల మండిపాటు
ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రత్యేక వర్గాలు
మండలి చైర్మన్ వైఖరిపై జిల్లాలో రచ్చ
గుర్రుగా మిర్యాలగూడ కాంగ్రెస్ నేతలు..బీఆరెస్ ఎమ్మెల్యేలు
రాజ్యాంగ హోదాలో రాజకీయాల నిర్వాహణపై వ్యతిరేకత
విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: ఆయనోక రాజకీయ ఉద్దండుడు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు.. ఆయన పాచికలేస్తే తిరుగుండదు.. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో, అభివృద్ధిలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. వివిధ రాజకీయ పార్టీలలో పలు పదవులతో పాటు మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన మండలి చైర్మన్ పదవిలో ఉన్నారు. కానీ ఆయన నిత్యం గల్లి నుంచి ఢిల్లీ రాజకీయాలపై మాట్లాడడం.. నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లి రాజకీయ కోణంలో ప్రసంగించడం, ప్రత్యర్థి నాయకులపై రాజకీయపరమైన ఆరోపణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటం పట్ల ఆయన ప్రత్యర్థులు తప్పుపడుతున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలతో పాటు నియోజకవర్గాలలో పర్యటించిన సమయాల్లో అక్కడి ప్రత్యర్థి నాయకులను టార్గెట్ చేస్తూ గుత్తా మాట్లాడుతున్న తీరు సహజంగానే ప్రత్యర్థుల్లో అసహానాన్ని రగిలిస్తుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నిత్యం మీడియాలో కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలలో పెద్ద చర్చ నెలకొంది.
తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన స్థానిక రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో జరుగుతున్న బర్నింగ్ టాపిక్స్ పై నిత్యం ప్రెస్ మీట్ లు, మీడియాతో చిట్ చాట్ లు నిర్వహిస్తున్నారు. వివిధ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు వెళ్లిన సందర్భాలలో ఆయన ఆయా నియోజకవర్గాలలోని ప్రత్యర్థి నాయకులపైన, కాంగ్రెస్ పార్టీనేతలపైన, పోటీ చేయాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఆయా పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గుత్తా నియోజకవర్గాల పర్యటనలను, మీడియా సమావేశాలను బీఆరెస్ లోని గుత్తా వ్యతిరేక వర్గీయులు, ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తున్నారు. గుత్తా రాజకీయాలపై మాట్లాడడం అవసరమా అంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ నేతగా ఎదిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి మొదటి నుంచి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి తోపాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో, గతంలో నల్గొండ బిఅరెస్ ఇన్చార్జిగా ఉన్న దుబ్బాక నరసింహ రెడ్డి తో పాటు పలు నియోజకవర్గాల నేతలతో ఆయనకు మొదటి నుంచే సఖ్యత లేదు. మంత్రితో, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో పాటు మరికొందరు పార్టీ నేతలతో ఆయనకున్న విభేదాలు పలుసార్లు బయటపడ్డాయి. తన కొడుకుకు మునుగోడు టికెట్ కోసం ప్రయత్నించిన సందర్భంలో సిటింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోను పోటీ పడ్డారు. ప్రతి నియోజకవర్గంలో ఆయనకంటూ సొంత బ్యాచ్ తయారుచేసి వాళ్లకు టికెట్లు ఇప్పించుకునే పని గుత్తా చేస్తున్నారన్న ఆరోపణలు సొంత పార్టీలోనే వినబడుతున్నాయి. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న రమావత్ రవీంద్ర కుమార్ ప్రస్తుత నల్గొండ జిల్లాకు బీఆరెస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన దేవరకొండలో గుత్తా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వడ్త్యా దేవేందర్ నాయక్ తో పాటు మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ఎంపీపీ జానీ యాదవ్ లను తన వర్గంంగా ప్రోత్సహిస్తు వచ్చారు. ఇప్పుడు వారంతా గుత్తా ఆశీస్సులతోనే సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు వ్యతిరేంగా వారిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని అసమ్మతి సమావేశాలతో రచ్చ చేస్తున్నారు.
ఆంధ్ర నాయకులను తరిమికొట్టండని మిర్యాలగూడలో వ్యాఖ్యలు
తాజాగా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అడవిదేవులపల్లి లో అభివృద్ధి పనుల కోసం వెళ్లిన గుత్తా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆంధ్ర నుంచి కొందరు వలసదారులు వచ్చారంటూ అక్కడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేశారు. సేవ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న ఆంధ్ర వ్యాపారులను తరిమికొట్టడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నల్లమోతు భాస్కర్ రావుని మూడోసారి గెలిపించాలని కోరుతునే కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజకీయపరమైన విమర్శలు చేస్తూ గుత్తా చేసిన ప్రసంగం స్థానికంగా కాంగ్రెస్ నేతలలో ఆగ్రహ జ్వాలలను రేపింది. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు వరుస ప్రెస్ మీట్ లు పెట్టి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పలు పార్టీలు మారి, పలు కండువాలను కప్పుకున్న చరిత్ర మరువరాదంటూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా రాజ్యాంగపరమైన హోదాలో ఉండి కూడా రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలపై అనుచిత విమర్శలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.

కొడుకు కోసం విశ్వ ప్రయత్నాలు..
ఇదిలా ఉంటే మునుగోడు, నల్లగొండలలో తన కుమారుడు అమిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన సుఖేందర్ రెడ్డి సిటింగ్‌లకే సీఎం కేసీఆర్ మరోసారి టికెట్లు ప్రకటించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో కొడుకు అమిత్ రెడ్డిని అక్కడ నుంచి మరల వ్యాపారం వైపు పంపాడని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. తన తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి కొద్ది రోజులు నల్గొండ, మునుగోడు నియోజకవర్గాలలో హడావుడి చేసిన సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ కనిపించకపోవడంతో కేవలం ఎమ్మెల్యే టికెట్ల కోసమే ఆయన హడావుడి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలపై గుత్తా సుఖేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, విమర్శలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి. రాజ్యాంగపరమైన హోదాలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన వైఖరి మార్చుకుంటే బాగుంటుందని ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడాఉచిత సలహా ఇస్తున్నారు.
నేను ఆంధ్ర వలసదారున్ని కాదు : మిర్యాలగూడ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల

మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మదిలో నిలిచిన తనను గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆంధ్ర వ్యక్తిగా చిత్రీకరించి ప్రజలలో విష ప్రచారం చేసే పని మొదలు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మిర్యాలగూడ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక తన వర్గీయుడైన ఎమ్మెల్యే భాస్కర్‌రావు రానున్న ఎనిన్నికల్లో నా చేతిలో ఓడిపోతారన్న అక్కసుతోనే గుత్తా నాపై ప్రాంతం పేరుతో బురద చల్లుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో పుట్టి పెరిగిన తనను ఆంధ్ర వలసదారుడుని అసత్య ఆరోపణలు చేయడం రాజ్యంగ హోదాలో ఉన్న సుఖేందర్ రెడ్డికి తగదన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మిర్యాలగూడ ప్రజలు నన్ను ఆదరిస్తారనే విశ్వాసం ఉందన్నారు.