విధాత: దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నా… ఎక్కడెక్కడైనా పార్టీ మంచిగా ఉనికిలోకి వస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎంతకూ ఎదగడం లేదు. అప్పుడెప్పుడో టిడిపితో పొత్తులో ఉన్నపుడు మాత్రమే కాస్త ఉనికిలోకి వస్తున్నా బీజేపీ మళ్ళీ పొత్తు తెగిపోగానే జీరోకు వెళ్ళిపోతోంది. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు సారథ్యం వహించినా పార్టీ ఏమాత్రం ఎదగలేకపోయింది.
ఇప్పుడు పార్టీలోకి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేరడం పార్టీకి కొత్త ఊపును తెస్తోంది. వాస్తవానికి బీజేపీలోకి ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు చేరడం చాలా పెద్ద విషయమే. అయితే ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని ఏవిధంగా లాగుతారు… జిల్లా, మండల స్థాయిలో క్యాడర్ అయన వెంట వస్తారా.. తెలంగాణ మాదిరిగా ఆ స్థాయిలో పార్టీకి జవసత్వాలు వస్తాయా అని బీజేపీ క్యాడర్ ఆశిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా కేంద్ర బీజేపీ నేతలు ఆయన ప్రభావం ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు అంత సీన్ ఉందా అన్నదాని మీదనే ప్రజల్లో సందేహాలు ఉన్నాయ్. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని కేవలం తెలంగాణలో పార్టీ కోసం గానీ ఉపయోగించుకోదలిస్తే మాత్రం అది పెద్ద తప్పిదమే అవుతుందని అంటున్నారు. సంయుక్త ఆంధ్ర సీఎంగా ఉన్నపుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పాటును ఎంతగా వ్యతిరేకించింది తెలంగాణ ప్రజలు, తెరాస నాయకులూ గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ తనలో చేర్చుకుందని విమర్శలు సంధిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో చేయడానికి ఏమీ లేదని, ఆయన ప్రభావం అంతంతమాత్రమే ఉంటుందని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈమధ్య టీడీపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. పవన్ కల్యాణ్ చరిష్మా పైనే బీజేపీ ఏపీలో ఆధారపడింది. ఇక బీజేపీలో ఉన్న టిడిపి నాయకులూ సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ సీఎం రమేష్ ఆదినారాయణరెడ్డి, పురంధేశ్వరి వంటి వాళ్ళతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తారా.? అసలు వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డిని అంగీకరిస్తారా.. ఇలాంటి పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.