YCP
విధాత: ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రాజేసిన అగ్గి ఇంకా మండుతూనే ఉంది. వాలంటీర్లు సామాజిక విద్రోహులు అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఆంధ్రాలో పెద్ద దుమారాన్ని లేపాయి. దీనికి ప్రతిగా రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ధర్నా చేసి, పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసారు. ఆయనమీద పోలీసులకు ఫిర్యాదు చేసారు.
మహిళలను అక్రమ రవాణా చేసేందుకు ఈ వాలంటీర్లు తోడ్పడుతున్నారు అని పవన్ చేసిన ప్రకటనకు ప్రతిగా వైసిపి నాయకులూ, మంత్రులు నిన్న, ఈరోజు పవన్ మీద గట్టిగానే ఎదురుదాడి చేసారు. ఆ క్రమంలో లోకేష్ మీద గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఓ దళిత వాలంటీర్ కాళ్లు కడిగారు.
ఆయన దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని యస్సీ మహిళా వాలంటీర్ జే.రజిత కాళ్ళు కడిగి ఘనంగా సన్మానించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తున్న వాలంటీర్లపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు, ప్రతిపక్షాల వక్రబుద్ధికి తాను ఈ విధంగా సమాధాన ఇస్తున్నాను అని అయన అన్నారు.