శతకోటి లింగాల్లో బోడి లింగం.. BRSను పట్టించుకోని YCP
ఉన్నమాట: కేసీఆర్ స్థాపించిన భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని.. తెలుగు వాళ్ళున్న ప్రతిచోటా ప్రాతినిధ్యం వహిస్తుందని ఆపార్టీ నేతలు కొందరు ఆశిస్తుండగా ఆంధ్రాలో మాత్రం ఆ పప్పులేమి ఉడకవని.. ఇప్పుడున్న బోలెడన్ని ప్రతిపక్ష పార్టీల్లో అదీ ఒకటి అవుతుంది తప్ప ఇంకేం కాదని వైఎస్సార్సీపీ మంత్రులు అంటున్నారు. ఆ పార్టీతో తమకు నష్టం ఏమి లేదని వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ […]

ఉన్నమాట: కేసీఆర్ స్థాపించిన భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని.. తెలుగు వాళ్ళున్న ప్రతిచోటా ప్రాతినిధ్యం వహిస్తుందని ఆపార్టీ నేతలు కొందరు ఆశిస్తుండగా ఆంధ్రాలో మాత్రం ఆ పప్పులేమి ఉడకవని.. ఇప్పుడున్న బోలెడన్ని ప్రతిపక్ష పార్టీల్లో అదీ ఒకటి అవుతుంది తప్ప ఇంకేం కాదని వైఎస్సార్సీపీ మంత్రులు అంటున్నారు. ఆ పార్టీతో తమకు నష్టం ఏమి లేదని వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు.
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఏటుంది.. ఆంధ్రాలో ఇప్పుడున్న తెలుగుదేశం.. కాంగ్రెస్. బీజేపీ.. లెఫ్ట్.. జనసేన వంటి పార్టీల్లాంటిదే అదీనూ.. మాకేటి నష్టం.. మాకేటి భయం అని తీసి పడేశారు.” తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరికైనా ఎక్కడైనా రాజకీయ పార్టీని ప్రారంభించే స్వేచ్ఛ ఉందన్నారు. ఆంధ్రాలో ఎన్నికల్లో పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పార్టీ మనుగడ సాగించే అవకాశాలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనిని అంగీకరించరని రాజన్న దొర స్పష్టం చేశారు. “కేసీఆర్ ఇక్కడికి వచ్చి మా ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి ఎలా అనుమతిస్తాం? హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడానికి అంగీకరించ లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఆధిపత్యాన్ని ప్రజలు అంగీకరించరు” అని రాజన్న దొర కుండబద్దలు కొట్టారు.
అయితే మనుగడలో విఫలమైన కొన్ని పార్టీలు కేసీఆర్‌తో చేతులు కలపవచ్చని డిప్యూటీ సీఎం రాజన్నదొర అభిప్రాయపడ్డారు.అలాగే రాజకీయంగా భవిష్యత్తు అవకాశాలు లేని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్లోకి జంప్ అయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కేసీఆర్… ఉత్తర కోస్తా ఆంధ్రా నుండి వెలమ నాయకులను కూడా ఆకర్షించడానికి ప్రయత్నించవచ్చన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ కేసీఆర్ పార్టీలో చేరరని తేల్చిచెప్పారు. ప్రజల మద్దతుతో ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ చాలా బలంగా ఉందన్నారు.
ఇంకా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని అంటూనే తమ విధానం తమకు ఉందని.. తాము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని అన్నారు. కొత్త పార్టీల రాకపై తాము విశ్లేషించబోమని.. ఏపీ అభ్యున్నతి తమకు ప్రధానం అని అన్నారు. పక్క రాష్ట్రాల గురించి తాము మాట్లాడకున్నా ఆ నాయకులు మాత్రం ఏపీ విషయంలో విమర్శలు చేస్తున్నారని అన్నారు.