ప్రవళికది ప్రభుత్వ హత్యే.. కాంగ్రెస్ నేత ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ప్రవళికది ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

ప్రవళికది ప్రభుత్వ హత్యే.. కాంగ్రెస్ నేత ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

– విద్యార్థుల కలలను చిదిమేస్తున్న కేసీఆర్

– బాధితులకు అండగా నిలవని మంత్రులు, ఎమ్మెల్యేలు

– టీఎస్పీఎస్సీని రద్దు చేయాలి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ప్రవళికది ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని కాంగ్రెస్ నేత ఎన్నం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణను దుర్మార్గుల చేతిలో పెట్టామన్నారు. విద్యార్థులు బలిదానం చేసుకుంటే, పాడే మోసి నివాళ్లు అర్పించామన్నారు.

తెలంగాణ వచ్చాకా కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లో చలనం లేకుండా పోయిందని ఎన్నం విమర్శించారు. ఉద్యోగాలు లేక విద్యార్థులు తీవ్ర నిరాశకు గురై బలిదానమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు చెందిన మంత్రి ఉద్యమ నేతగా చెప్పుకుంటున్నారని, విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు చెప్పే ధైర్యం లేదన్నారు. సంపాదన మీద తప్పా విద్యార్థుల బాగోగులు పట్టని మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద బానిసలుగా బతుకుతున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలపై కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయిందన్నారు.

ఇంత జరిగినా చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్యలు లేవని, ఆయన జీహెచ్ ఎంసీ కమిషనర్ గా ఉన్న సమయంలో రాష్ట్ర సంపద కల్వకుంట్ల కుటుంబానికి దోచి పెట్టినందుకే ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. జనార్దన్ రెడ్డి కుర్చీ కదిలిస్తే కేసీఆర్, మంత్రుల కుర్చీ కదులుతుందనే భయంతోనే కాపాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు ఒక్క తాటిపై నిలిచి పోరాడి ఈ ప్రభుత్వం గద్దే దిగే వరకు శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఆ వెంటనే టీఎస్పీఎస్సీని రద్దు చేసి, కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులను కాపాడుకుంటామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హర్ష వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.