YS Sharmila | మాట షర్మిలది.. ప్రణాళిక అనిల్‌ది!

YS Sharmila పార్టీలో జగన్‌ స్థానాన్ని ఆశించిన షర్మిల! అన్నకు శిక్ష పడి జైలుకు వెళితే పార్టీ పగ్గాలు దక్కుతాయని ఆశ? కాలం కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్లాన్‌! అందుకే జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర? నిజంగా జగన్‌ కోరడంతోనే ఆమె పాదయాత్ర చేశారా? పాదయాత్ర చేపట్టాలన్న ఆలోచన షర్మిలదా? అనిల్‌దా? ఉన్నమాట: ఒక పార్టీకి అధ్యక్షురాలు ఆమె. కానీ.. ఆమె మాటలు మాత్రం రాజకీయ నేతలా ఉండవు! మహానాయకుడి కూతురినని చెప్పకొంటారు.. […]

  • Publish Date - April 29, 2023 / 03:02 PM IST

YS Sharmila

  • పార్టీలో జగన్‌ స్థానాన్ని ఆశించిన షర్మిల!
  • అన్నకు శిక్ష పడి జైలుకు వెళితే పార్టీ పగ్గాలు దక్కుతాయని ఆశ?
  • కాలం కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్లాన్‌!
  • అందుకే జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర?
  • నిజంగా జగన్‌ కోరడంతోనే ఆమె పాదయాత్ర చేశారా?
  • పాదయాత్ర చేపట్టాలన్న ఆలోచన షర్మిలదా? అనిల్‌దా?

ఉన్నమాట: ఒక పార్టీకి అధ్యక్షురాలు ఆమె. కానీ.. ఆమె మాటలు మాత్రం రాజకీయ నేతలా ఉండవు! మహానాయకుడి కూతురినని చెప్పకొంటారు.. కానీ.. ఆ రాజకీయ వారసత్వ సూచనలు కూడా కనిపించవు! మాట్లాడితే మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తు చేస్తుంటారు! కానీ.. అంతటి యాత్ర చేసిన తర్వాత రావాల్సిన పరిపక్వత ఆమెలో ఏ కోశానా కనిపించదు! ఇది ఎవరి గురించి ఉపోద్ఘాతమో అర్థమైపోయి ఉంటుంది! రాయలసీమకు చెందిన తన తండ్రి పేరిట తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల (YS Sharmila) గురించే!

తెలంగాణలో పటిష్టమైన పార్టీ నిర్మాణం లేకపోయినా.. కేవలం సంచలన ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వైఎస్‌ షర్మిల మీడియాలో చోటు సంపాదించుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో లేకపోయినా.. మీడియాలో మాత్రం నాయకురాలిగా చెలామణీ అయిపోతున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. మాటలు మాత్రమే ఆమెవని, ఆమె చర్యలన్నింటి వెనుక ప్లాన్లు మాత్రం బయటకు కనిపించని ఆమె భర్త అనిల్‌ రూపొందించేవని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే వారు చెబుతుంటారు! వైఎస్‌ జగన్‌కు, షర్మిలకు మధ్య ఎడం పెరగటానికి కూడా అనిల్‌ వ్యవహార శైలి కారణమని వారు పేర్కొంటున్నారు.

దీని వెనుక పెద్ద పన్నాగమే నడిచిందని, దానిని జగన్‌ పసిగట్టి, రాజకీయంగా షర్మిలకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలంగాణను ఎంచుకున్నారనేది రాజకీయ నిపుణుల వాదనగా ఉన్నది. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు కూడా ఒక సందర్భంలో వెల్లడించడం ఇక్కడ గమనార్హం.

అలా మొదలైంది..

క్రైస్తవ మత బోధకుడు బ్రదర్‌ అనిల్‌ షర్మిలను వివాహం చేసుకున్న తర్వాత షర్మిల తల్లి విజయమ్మను క్రైస్తవానికి బాగా దగ్గర చేశారని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు తెలిపారు. వాస్తవానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం క్రైస్తవ మతారాధకులు అయినప్పటికీ సాధారణంగానే ఉండేవారని, ఆ కుటుంబంలోకి అనిల్‌ ప్రవేశించిన దగ్గర నుంచి పరిస్థితి మారిపోయిందని వారు పేర్కొంటున్నారు.

అది ఎంతదాకా వెళ్లిందంటే.. షర్మిల బిడ్డలను దగ్గరకు తీసుకున్నంతగా జగన్‌ పిల్లలను విజయమ్మ దగ్గరికి తీసుకునేవారు కాదని సమాచారం. ఆ సమయంలో జరిగిన కొన్ని గొడవలతోనే జగన్‌ కుటుంబం బెంగళూరులో మకాం పెట్టి.. అక్కడి నుంచి తన వ్యాపారాలు నిర్వహించుకునేవాడని తెలుస్తున్నది.

జగన్‌ కేసులతో అందివచ్చిన అవకాశం

జగన్‌ తిరిగి హైదరాబాద్‌కు తరలిరావడం, సాక్షి మీడియా ప్రారంభం, జగన్‌ ఎంపీగా గెలవడం వంటి పరిణామాల తదుపరి ఘోర ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కన్నుమూశారు. ఆ సమయంలో తండ్రి శవం ఉండగానే ముఖ్యమంత్రి పదవిని జగన్‌ ఆశించాడన్న వార్తలు వచ్చాయి.

అది వేరే విషయం. జగన్‌ అక్రమార్జన కేసులు ముందుకు వచ్చి, ఆయన కొంతకాలం జైలుకు వెళ్లటాన్ని సావకాశంగా మల్చుకోవాలని అనిల్‌ భావించారని, అందుకే షర్మిలతో పాదయాత్ర చేయించారని వైఎస్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు. దీని వెనుక పెద్ద రాజకీయ ప్రణాళిక ఉన్నదని అంటున్నారు.

జగనన్న వదిలిన బాణమేనా?

జగన్‌ అరెస్టయి ఉన్న కాలంలో ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అని చెప్పకొంటూ షర్మిల పాదయాత్ర మొదలు పెట్టారు. అసలు నిజంగానే జగన్‌ తన తరఫున తన చెల్లెలిని పాదయాత్ర చేయమని కోరారా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే.. జగన్‌ కోరకుండానే పార్టీలో జగన్‌ స్థానాన్ని షర్మిల చేపట్టాలనే ఆలోచనతోనే అనిల్‌ ఆమెతో పాదయాత్ర చేయించారని ఆ విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

జగన్‌కు అక్రమాస్తుల కేసులో శిక్ష పడటం ఖాయమని, అదే జరిగితే పార్టీని గుప్పిట్లో పెట్టుకోవచ్చని, అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చని, తాను షాడో సీఎంగా అధికారం చెలాయించవచ్చని అనిల్‌ భావించారని ఆ వర్గాల కథనం. షర్మిల చేపట్టిన పాదయాత్రకు స్పందన కూడా బాగా వచ్చింది.

కానీ.. అనుకున్న విధంగా జరగలేదు. జగన్‌ ఎట్టకేలకే బయటకు వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తదుపరి ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టి, ప్రత్యేక హోదా ప్రధాన అంశంగా ఎన్నికల్లో గెలిచారు. షర్మిలకు దక్కని రాజకీయ అవకాశాలు 2019లో వైఎస్సార్సీపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయాలు సాధించింది. జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

అయితే.. ఆ సమయంలో షర్మిలకు హామీ ఇచ్చిన విధంగా రాజకీయ అవకాశాలు దక్కలేదనే ప్రచారం ఉన్నది. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ రాకపోయినా రాజ్యసభకు అయినా తన అన్న అవకాశం ఇస్తాడని షర్మిల భావించారని, ఆ ఆశ కూడా నెరవేరలేదని అంటుంటారు. అప్పటి నుంచి జగన్‌కు, షర్మిలకు మధ్య అగాధం బాగా పెరిగిపోయిందని సమాచారం. పైగా వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు సైతం ఉన్నాయని గోనె ప్రకాశరావు వంటివారు చెప్పారు.

ఇద్దరూ ఎడముఖం పెడముఖం

వైఎస్‌ జయంతి కార్యక్రమం గానీ, వర్థంతి కార్యక్రమంగానీ వస్తే ఇద్దరూ పలకరించుకున్న సందర్భాలే కనిపించలేదని పలువురు రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఒక సందర్భంలో వైఎస్‌ జయంతి కార్యక్రమానికి జగన్‌ ఉదయం ఇడుపులపాయ వెళ్లి నివాళులర్పించాల్సి ఉండగా.. అదే సమయానికి తన చెల్లెలు కూడా వస్తున్నదన్న సమాచారంతో జగన్‌ తన కార్యక్రమాన్ని మధ్యహ్నానికి వాయిదా వేసుకున్నారని వార్తలు వచ్చాయి.

తాను అధికారంలోకి రావడానికి సహకారం అందించిన తన చెల్లెలు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పార్టీ పెడుతుంటే జగన్‌ కనీసం శుభాకాంక్షలు అయినా ఎందుకు చెప్పలేదని పలువురు అప్పట్లోనే సందేహాలు వ్యక్తం చేశారు.

అనిల్‌ భయంతోనే షర్మిలకు దక్కని రాజకీయ అవకాశాలు!

షర్మిలకు రాజకీయంగా అవకాశాలు ఇస్తే వాటిని అనిల్‌ తన స్వార్థానికి వాడుకునే అవకాశం ఉందని జగన్‌ భావించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. షర్మిల ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో అనిల్‌ చక్రం తిప్పుతారని అనుమానించే ఆమెను దూరం పెట్టారని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో ముదిరిన గొడవల్లోనే విజయమ్మ, షర్మిల తెలంగాణకు మకాం మార్చారని అంటున్నారు. ఇక్కడ తన తండ్రి అభిమానులను కూడదీసి పార్టీని అభివృద్ధి చేయాలని భావించారని సమాచారం. అయితే.. ఆమె అనుకున్నంత స్థాయిలో వైఎస్‌తో అనుబంధం ఉన్న కీలక నేతలెవరూ ఆమె వెంట నడిచేందుకు సిద్ధపడలేదు.

ఏదీ పరిపక్వత?

ఎలాంటి రాజకీయ అనుభవం లేని షర్మిల సహజంగానే చాలా సందర్భాల్లో తన అపరిపక్వతను బయటపెట్టుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాను నియమించుకున్న మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన సమాచారాల ఆధారంగా షర్మిల వివిధ నాయకులపై ఆరోపణలు చేస్తుంటారని సమాచారం. ఈ క్రమంలో రాజకీయంగా చూపాల్సిన వ్యవహార దక్షతను ఆమె చూపలేకపోతున్నారని అంటున్నారు.

ఇటీవలికాలంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తాను సైతం మెరవాలని భావించిన షర్మిల.. అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఫోన్‌లు చేసి, కలిసి కలిసి ఉద్యమం చేద్దామని ప్రతిపాదించారు. అందులో భాగంగా సీపీఎం కార్యాలయానికి వెళ్లారు.

అయితే.. బీజేపీతో సైద్ధాంతికంగా తీవ్రంగా వ్యతిరేకించే సీపీఎం.. సహజంగానే బీజేపీ ఉన్న వేదికను పంచుకునేందుకు నిరాకరించింది. ఈ సమయంలో ఆఫీసు గదిలో మాట్లాడుకున్న అంశాలపై షర్మిల ఆ పార్టీ కార్యాలయంలోనే, ఆ పార్టీ నేతల సమక్షంలో విమర్శలు గుప్పించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది.

సరే.. ఆమెకు ఆ వెంటనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కౌంటర్‌ ఇస్తూ ఇలా మాట్లాడటం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చురకలు అంటించారు. ఏది ఏమైనా ఆమె తెలిసి చేస్తున్నారా? తెలిసీతెలియక చేస్తుననారా? అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. ఆమెకు కనీస రాజకీయ పరిపక్వత లేదనేందుకు ఇదే నిదర్శనమని కొందరు విమర్శించారు.