YS Sharmila | బండి, రేవంత్‌లకు షర్మిల ఫోన్‌.. ప్రగతి భవన్‌ మార్చ్‌కు పిలుపునిద్దామని ప్రతిపాదన

YS Sharmila | నిరుద్యోగ సమస్యపై సంయుక్త ఆందోళనకు యోచన ఏకాకిలా షర్మిల.. పాదయాత్రకూ స్పందన కరువు అందుకనే రాష్ట్రంలోని విపక్ష నాయకులకు ఫోన్లు విధాత: రాష్ట్రంలో రాజకీయ నాయకులందరిదీ ఒక తీరు అయితే.. షర్మిలది మరోతీరు అన్నట్టు ఉంది. తెలంగాణ పార్టీ అనే తోక ముందు తన తండ్రి వైఎస్‌ పేరును ముందు తగిలించుకుని, వైఎస్‌ఆర్‌టీపీగా చలామణి అవుతున్న షర్మిల (Sharmila) పార్టీనిగానీ, ఆమెనుగానీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పా.. దా.. ల.. మీద […]

  • By: krs    latest    Apr 01, 2023 8:49 AM IST
YS Sharmila | బండి, రేవంత్‌లకు షర్మిల ఫోన్‌.. ప్రగతి భవన్‌ మార్చ్‌కు పిలుపునిద్దామని ప్రతిపాదన

YS Sharmila |

  • నిరుద్యోగ సమస్యపై సంయుక్త ఆందోళనకు యోచన
  • ఏకాకిలా షర్మిల.. పాదయాత్రకూ స్పందన కరువు
  • అందుకనే రాష్ట్రంలోని విపక్ష నాయకులకు ఫోన్లు

విధాత: రాష్ట్రంలో రాజకీయ నాయకులందరిదీ ఒక తీరు అయితే.. షర్మిలది మరోతీరు అన్నట్టు ఉంది. తెలంగాణ పార్టీ అనే తోక ముందు తన తండ్రి వైఎస్‌ పేరును ముందు తగిలించుకుని, వైఎస్‌ఆర్‌టీపీగా చలామణి అవుతున్న షర్మిల (Sharmila) పార్టీనిగానీ, ఆమెనుగానీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పా.. దా.. ల.. మీద నడిచే యాత్ర చేయడం, ఏమైనా ఇష్యూలు ఉన్నప్పుడు హంగామా చేయడం తప్ప మరోటి ఉండటం లేదు. మీడియా హడావుడి తప్ప జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మధ్యే టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై (TSPSC Paper Leak Issue) కమిషన్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన షర్మిల.. రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఆమెను అరెస్టు చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనడం తప్ప తర్వాత అంతా మామూలై పోయింది.

ఉనికి చాటుకోవడమే ఉద్దేశం

ఏం చేసినా తాను ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నానన్న భావనలో ఉన్న షర్మిల.. కనీసం ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని అయినా కాస్త ఉనికి చాటాలన్న ఉద్దేశంతో ఉన్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. నిరుద్యోగ సమస్యపై ఐక్య కార్యాచరణ చేపడుతామంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆమె ఫోన్‌ చేయడం వెనుక ఇదే కారణమని అంటున్నారు. నిరుద్యోగ సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని, ఆ వెంటనే ప్రగతిభవన్‌ మార్చ్‌కు పిలుపునిద్దామని ఆమె ప్రతిపాదించారు. కేసీఆర్‌ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని, లేదంటే తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటు లేకుండా పోతుందని ఆమె చెప్పారు.

వెనుకబడిపోతున్నామనే భయంతోనే!

పరస్పర సిద్దాంత విభేదాలున్న రాజకీయ పార్టీలు దేనికి దానికే పోరాటం చేస్తున్నాయి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా బలోపేతం కావడానికి ఏ పార్టీకి, ఆ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని పని చేస్తున్నాయి. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య రాజకీయంగా ప్రత్యక్ష యుద్ధమే నడుస్తున్నది. రాష్ర్టంలో కూడా ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే మండే పరిస్ఠితులున్నాయి. అయితే టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం రాజకీయ దూమారం రేపడంతో నిరుద్యోగులపై పోరాటంలో కాంగ్రెస్‌ అందరి కంటే ముందున్నది. ఆ తరువాత బీజేపీ రెండవ స్థానంలో ఉంది.

ఏకాకిలా మారుతున్న వైఎస్‌ఆర్‌టీపీ

పేపర్‌ లీకేజీ అనే కాదు.. వైఎస్‌ఆర్‌టీపీ ఏ ప్రకటన చేసినా.. ఏ ఆందోళన చేసినా తెలంగాణ సమాజం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ విషయం ఆ పార్టీ నేతలకు కూడా అర్థమైపోయిందని చెబుతున్నారు.

నిరుద్యోగ సమస్యపై పోరాటంలో పూర్తిగా వెనుకబడిపోయిన వైఎస్‌ఆర్‌టీపీ.. ఏది చేసైనా ముందు వరుసలోకి రావడానికి తాపత్రయ పడుతున్నది. ఈ క్రమంలోనే ఏకంగా ప్రగతిభవన్‌ మార్చ్‌కు పిలుపునిద్దామని విపక్ష నేతలకు షర్మిల ఫోన్‌ చేశారని భావిస్తున్నారు.

ఒక్క వైఎస్‌ఆర్‌టీపీ మాత్రమే ప్రగతిభవన్‌కు పిలుపునిస్తే వచ్చే స్పందనపై ఆ పార్టీ నేతలకు అవగాహన లేకపోలేదు. ఇతర పక్షాలు కూడా కలిస్తే తన జెండాలు కూడా కనిపిస్తాయన్న భావనతో ఆమె ఈ ప్రతిపాదన చేశారని అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిసిరాని పక్షంలో ఇవి అధికార పార్టీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించే అవకాశం కూడా మిగిలే ఉంటుందని వైఎస్‌ఆర్‌టీపీ ప్లాన్‌గా చెబుతున్నారు.

ఉమ్మడి పోరాటానికి మద్దతు తెలిపిన బండి

షర్మిల ఫోన్‌ కాల్‌పై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపారు. ఈ మేరకు త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.

పార్టీలో చర్చించి చెబుతానన్న రేవంత్‌

ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి ఫోన్‌లో షర్మిలతో అన్నారు. అయితే ఈ ప్రతిపాదనపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.