విధాత: మొన్నామధ్యనే రాజకీయ పార్టీ పెట్టుకుని.. నాయకురాలి అవతారం ఎత్తిన వైఎస్ షర్మిల రాజకీయంగా పరిపక్వత సాధించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తున్నది. మీడియా సమావేశాల్లోనో లేదా బహిరంగ సభలోనో చేసినట్టు ఎక్కడైనా విమర్శలు చేసేయవచ్చన్నట్టు షర్మిల వ్యవహరిస్తున్న తీరు.. పిల్లలాటలా కనిపిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తానేమి చేసినా ఎవరూ పట్టించుకోవకపోవడంతో షర్మిల రాజకీయంగా ఏకాకి అయ్యారు. దీంతో ప్రతిపక్షాలను కలుపుకొని సంయుక్త కార్యాచరణకు దిగేందుకు షర్మిల సమాయత్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి.. నిరుద్యోగ సమస్యపై తన ప్రతిపాదన తెలిపారు. సంయుక్తంగా ప్రగతి భవన్ మార్చ్‌కు పిలునిద్దామని కూడా చెప్పారు. బండి ఓకే అన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీలో మాట్లాడి చెబుతామన్నారు.
ఇదిలా ఉంటే.. వామపక్ష నాయకులను కూడా కలవాలనుకున్న షర్మిల.. సీపీఎం నేతలకు ఫోన్ చేసి.. ఆఫీసుకు వస్తానని అడిగారు. వారు రమ్మనడంతో మంగళవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి షర్మిల చేరుకున్నారు. పలకరింపులు, ఫొటోలు ముగిసిన తర్వాత సంయుక్త కార్యాచరణపై లేఖను తమ్మినేనికి అందించారు. బీఆర్‌ఎస్ నేతలతో సీపీఎం నేతలకు ఇప్పటికైతే ఢీ అంటే ఢీ అనుకునే పరిస్థితి లేదు. ఈ విషయం షర్మిలకు తెలియదనుకోలేం.
కానీ.. సీపీఎం కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. తాము బీజేపీకి బీ టీమ్‌లా వ్యవహరించడం లేదని చెబుతూ.. వామపక్షాలే బీఆర్‌ఎస్‌కు బీ టీమ్‌లా మారాయని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టులు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వంపై పోరాటంలో కలిసి రావాలని తనను ఎప్పుడైనా కోరారా? కనీసం ఫోన్ చేసి పిలిచారా? అని తమ్మినేని అక్కడే నిలదీశారు. అయినా తాను సీపీఎం కార్యాలయానికి వచ్చి లేఖ ఇచ్చానని చెప్పారు. బీజేపీని నిలదీసిన ఏకైక పార్టీ తమదేనని చెప్పారు.
YS Sharmila vs Tammineni | pic.twitter.com/MOlEkqLwt5
— vidhaathanews (@vidhaathanews) April 4, 2023
లెటర్ ఇచ్చేందుకు ఆఫీసుకు వస్తామని అడిగి, వచ్చిన తర్వాత విమర్శలకు దిగిన షర్మిల తీరుపై సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు తాము ఇచ్చిన మర్యాదను షర్మిల నిలుపుకోలేదని మెత్తగానే చురకలంటించారు. తమ కార్యాలయానికి వచ్చి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. రాజకీయ వైఖరులు ఉంటాయని, తమ వైఖరి తమకు ఉన్నదని చెప్పారు.
మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. తాము అది చాటుగా చేయలేదని బాహాటంగానే చేశామని స్పష్టం చేశారు. తమ ఆఫీసుకు వచ్చి తాము ఎవరికో బీటీమ్‌గా ఉన్నామని విమర్శించేందుకు సాహసం చేయడం మంచిది కాదని హితవు పలికారు. తమ ఆఫీసుకు వచ్చి షర్మిల మాట్లాడినట్టు తాను మాట్లాడలేనని, తనకు విజ్ఞత ఉన్నదని చెప్పారు.
షర్మిల నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి చేసిన ప్రతిపాదన మంచిదేనన్న తమ్మినేని.. ఇటీవలి తమ జన చైతన్య యాత్రల్లో పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పార్టీలు కలిసి చేయాలనే ప్రతిపాదన బాగానే ఉంది కానీ.. అందులో బీజేపీని కలుపుకొని చేయడం సరికాదన్నారు.
బీజేపీ ఇంతకంటే పాపిష్టిపార్టీ అని అన్నారు. ముందుగా నిర్ణయాలు తీసుకుని, మద్దతు కోరడం సరికాదన్నారు. ఒక కార్యాచరణపై ప్రతిపాదన వచ్చినప్పడు అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తమపై చేసిన వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.