విధాత: దారులన్నీ మూసుకుపోయినప్పుడు కొత్త దారులు వేసుకొని ముందుకు సాగిన వాడే సక్సెస్ సాధిస్తాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు కూడా అలాగే కొత్త దారులు తెరిచాడు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పెట్రోల్ బంకులు ఖాళీ అయి, ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయింది.
పెట్రోల్ దొరక్క ద్విచక్ర వాహనాలు నిలిచిపోగా.. ఓ ఫుడ్ డెలివరీ బ్యాయ్ వినూత్నంగా ఆలోచించాడు. గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అతడి ఆలోచన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు.
హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పెంచుతూ కేంద్రం తెచ్చిన సవరణను వ్యతిరేకిస్తూ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. పెట్రోల్ బంకులకు ఎక్కడికక్కడ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పరుగులుపెట్టారు.
కొద్ది సమయంలోనే పెట్రోల్ బంకులన్నీ వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. నగరం మొత్తం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి కనిపించింది.
హైదరాబాద్‌లో పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలు ఓ వైపు కనిపిస్తుండగా, మరో వైపు జొమాటో లోగో ఉన్న బ్యాగ్‌తో నగర వీధుల్లో ఒక వ్యక్తి దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న క్లిప్‌లో జొమాటో డెలివరీ ఏజెంట్ గుర్రంపై ఇంపీరియల్ హోటల్ పక్కన ఉన్న చంచల్‌గూడ వద్దకు వచ్చినట్టు వీడియో కనిపించింది. గుర్రంపై వచ్చిన వ్యక్తి వీధుల్లో కనిపించిన ప్రజలకు ఊపుతూ కనిపించాడు.
3 గంటలు లైన్లో ఉన్నా పెట్రోల్ దొరకలేదు..
ఏం జరిగిందని గుర్రపు స్వారీ చేస్తున్న ఫుడ్ డెలివరీ బ్యాయ్‌ను అడిగితే.. “మూడు గంటలపాటు క్యూలో వేచి ఉన్నాపెట్రోల్ దొరక లేదు. నేను ఫుడ్ డెలివరీ ఆర్డర్ తీసుకున్న తర్వాత వెళ్లిపోయాను. కానీ పెట్రోల్ పొందలేకపోయాను” అని పేర్కొన్నాడు. (పెట్రోల్ నహీ మిలా భాయ్. తీన్ ఘంటే లైన్ మే ఖడా రహా. జొమాటో సే నికల్ గయా.. పెట్రోల్ నహీ మిలా). బంకుల్లో పెట్రోల్ అయిపోయిన తర్వాత ఫుడ్ డెలివరీ చేయడానికి గుర్రంపై రావాలని నిర్ణయించుకున్నట్టు డెలివరీ ఏజెంట్ చెప్పాడు.