బీఫ్ వ్యాపారంలోకి జుకెన్‌బ‌ర్గ్‌.. మండిప‌డుతున్న ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా వ్య‌వ‌స్థాప‌కుడు, బిజినెస్ టైకూన్ మార్క్ జుకెన్‌బ‌ర్గ్ ప్ర‌క‌టించిన ఓ కొత్త వ్యాపారంపై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు మండిప‌డుతున్నారు

  • Publish Date - January 11, 2024 / 09:56 AM IST

ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) వ్య‌వ‌స్థాప‌కుడు, బిజినెస్ టైకూన్ మార్క్ జుకెన్‌బ‌ర్గ్ (Mark Zuckerberg) ప్ర‌క‌టించిన ఓ కొత్త వ్యాపారంపై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు మండిప‌డుతున్నారు. ఆ స్థానంలో ఉన్న ఓ వ్య‌క్తికి ఇలాంటి వ్యాపారం త‌గ‌ద‌ని హిత‌వు చెబుతున్నారు. ఇంత‌కీ ఆయ‌న ప్ర‌కటించిన వ్యాపారం ఏంటో తెలిస్తే కాస్త షాక్‌కు గుర‌వ‌డం ఖాయం.. అదే బీఫ్ (Beef ) బిజినెస్‌. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ బీఫ్‌ను ఉత్ప‌త్తి చేసేలా ప‌శువుల‌ (Beef Cattle) ను పెంచనున్నామ‌ని.. దీని కోస‌మే హ‌వాయిలోని ఒక ద్వీపంలో ఏర్పాట్లు చేశామ‌ని ఆయ‌న ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.


ఇక్క‌డ మేపే ఆవులు, గేదెలు వంటి ప‌శువుల‌కు బీర్‌, ప్ర‌త్యేక‌మైన న‌ట్స్ మాత్ర‌మే పెడ‌తామ‌ని జుకెన్‌బ‌ర్గ్ తెలిపారు. ఈ నెల 10న ఆయ‌న బీఫ్‌తో త‌యారుచేసే స్టీక్ అనే వంట‌కాన్ని తింటూ పోస్ట్ పెట్టారు. హ‌వాయిలోని క‌వాయీ అనే దీవిలో ప్ర‌పంచంలోనే అత్యంత ఉన్న‌త‌మైన నాణ్య‌మైన బీఫ్‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్నాం అని రాసుకొచ్చారు. ఇక్క‌డ ప‌శ‌వుల‌ను పెంచ‌డానికే ఆయ‌న 1400 ఎక‌రాల భూమిని సిద్ధం చేశారు. బీఫ్‌కు ప్ర‌సిద్ధి చెందిన వాగ్యూ, ఆంగ‌స్ జాతికి చెందిన ప‌శువుల‌ను బ‌ర్గ్ ఇక్క‌డ పెంచ‌నున్నారు.


‘ఈ జాతికి చెందిన ఒక్కో ప‌శువు ఏడాదికి 2000 నుంచి 4500 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. అంటే కొన్ని వంద‌ల ఎక‌రాల్లో మ‌క‌డ‌మియా చెట్ల గింజ‌ల‌ను తినేస్తాయి. నా కుమార్తెలు ఆ చెట్ల‌ను పెంచుతూ.. ఈ ప‌శువుల‌కు ఆహారం అందించ‌డానికి కృషి చేస్తారు. ఈ రంగంలో మేము ఇంకా ప్రారంభ ద‌శ‌లోనే ఉన్నాం. త్వ‌ర‌లోనే బీఫ్ వ్యాపారాన్ని విస్త‌రిస్తాం’ అని జుకెన్‌బ‌ర్గ్ అన్నారు. త‌న అన్ని వ్యాపారాల్లోనూ ఇదే అత్యంత రుచిక‌ర‌మైన‌దని ఆయ‌న వ్యాఖ్యానించారు.


అయితే ఈ నిర్ణ‌యంపై ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ప‌ర్యావ‌ర‌ణ‌ప‌రంగా ఎంతో సున్నిత‌మైన హ‌వాయీలో బీఫ్ వ్యాప‌రం ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని పేర్కొంటున్నారు. వీటికి ఇస్తామ‌ని చెబుతున్న మ‌క‌డ‌మియా గింజ‌ల కోసం ఆ చెట్ల‌ను బాగా పెంచాల‌ని.. వాటికి నీరు చాలా అవ‌స‌రమ‌ని ఫుడ్, వాట‌ర్ వాచ్ అనే ఎన్జీఓ పాల‌సీ డైరెక్ట‌ర్ మిచ్ జోన్స్ తెలిపారు. పశువుల‌కు ఇచ్చే బీర్ కోసమూ నీరు పెద్ద మొత్తంలో అవ‌స‌ర‌మ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే తీవ్ర అస‌మాన‌తలున్న ఆహార రంగంలో ధ‌నికుల ఆహారం కోసం ఇంత పెద్ద మొత్తంలో ప‌ర్యావ‌ర‌ణ ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌డం ఏ విధంగా స‌మ‌ర్థ‌నీయ‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.


ఇది మార్క్ జుకెన్‌బ‌ర్గ్‌లో ఉన్న చీక‌టి కోణాన్ని చూపిస్తోంద‌ని ఆక్షేపించారు. పేద‌ల‌కు ఆహారం అందించేందుకు చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా బీఫ్ ఫాంలు స‌రిపోతాయ‌ని.. ధ‌నికుల‌కు సేవ చేసే ఇలాంటివి అవ‌స‌రం లేద‌ని జోన్స్ స్ప‌ష్టం చేశారు. ఎక్స్ వేదిక‌గానూ మార్క్ బీఫ్ బిజినెస్ ప్ర‌క‌ట‌న‌పై చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మార్క్ ఇంకా చీక‌టి యుగంలోనే బ‌తుకుతున్నార‌ని జంతు హ‌క్కుల సంస్థ పెటా కు చెందిన షాలిన్ గాలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Latest News