Industrial parks | 28.6 వేల కోట్లతో తెలంగాణ, ఏపీ సహా పది రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక నగరాలు
దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం (Centre Cabinet) ఆమోదం తెలిపింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వీటని చేపట్టనున్నారు

నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ ప్రణాళిక
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం
Industrial parks | దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం (Centre Cabinet) ఆమోదం తెలిపింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (National Industrial Corridor Development Programme) కింద వీటని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులకు 28,602 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం సమావేశం నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రాజెక్టులు భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ పవర్ హౌస్ (global manufacturing powerhouse)గా మార్చివేస్తాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది.
దేశవ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ కొత్త పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పుర..పటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కడ్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని గయ, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలితోపాటు.. తెలంగాణలోని జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు, కొప్పర్తిలో నెలకొల్పుతారు. వీటిలో యూపీ, ఏపీలకు రెండేసి కేటాయించడం గమనార్హం. ఇందులో యూపీలో బీజేపీ అధికారంలో ఉండగా, ఏపీలో ఎన్డీయే కీలక భాగస్వామ్యపక్షం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నది.
అయితే.. 12వ ప్రాజెక్టు ఎక్కడ చేపట్టేదీ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) తన ప్రకటనలో పేర్కొనలేదు. అయితే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్న నేపథ్యంలో 12వ ప్రాంతాన్ని ప్రకటించడం లేదని కేంద్రమంత్రి పేర్కొనడం ద్వారా హర్యానా లేదా జమ్ముకశ్మీర్‌లో ఏర్పాటు చేస్తారనే సంకేతాన్ని ఇచ్చారు. ఈ ఇండస్ట్రీ ఏరియాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (State of Art Industrial Smart City) లుగా తీర్చిదిద్దనున్నారు. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఉత్పాదక హబ్‌లుగా వీటిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతున్నది.
ఈ ఇండస్ట్రియల్ ఏరియాల్లో (Industrial Corridor) భారీ పరిశ్రమలతోపాటు మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీలు (MSME)ల నుంచి పెట్టుబడులు పెట్టేలా ఎన్ఐసీడీపీ పనిచేస్తుంది. 2030 నాటికి భారతదేశాన్ని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో వీటిని తీసుకురానున్నటు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వర్క్ టు వర్క్, ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్టులతో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఈ ఇండస్ట్రియల్ సిటీలను డెవలప్ చేయనున్నారు. ఈ మేరకు ఇక్కడ అధునాతన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కూడా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో పది లక్షల మందికి నేరుగా, 30 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం పేర్కొన్నది.