విధాత: పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు భారతీయుల పాలిట మృత్యుపాశాలుగా మారతాయని మరో నివేదిక హెచ్చరించింది. శరీరం తట్టుకోలేని వేడి వల్ల గుండెపోట్లు, గుండె నొప్పి కేసులు పెరిగిపోతాయని, వాటి బారిన పడి ప్రజలు మరణిస్తారని తెలిపింది. భారత్, ఇండస్ నది పరీవాహక ప్రాంతాల్లో ఈ దుష్పరిణామాలు కాస్త ఎక్కువగానే కనపడతాయని తెలిపింది. పెన్ స్టేట్ కాలేజీ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్, పర్‌డ్యూ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ సైన్సెస్, పర్‌డ్యూ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది.
పూర్వ పారిశ్రామిక యుగంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ (Hot Temperatures) క్కువైనా సరే మానవుని ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతుందని ఇందులో పేర్కొన్నారు. ఆ నివేదికలో ఉన్న ప్రకారం.. మానవుని శరీరం కొంత మేర మాత్రమే ఉష్ణోగ్రత పెరుగుదలను, తేమను తట్టుకోగలదు. అంతకు మించితే గుండె నీరసం, హార్టఎటాక్‌ల వంటివి నిత్యకృత్యం అవుతాయి. ఒక వేళ ఉష్ణోగ్రతల పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ దాటితే భారత్, పాకిస్థాన్‌లలో 200 కోట్ల మంది, తూర్పు చైనాలోని 100 కోట్ల మంది, ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 కోట్ల మంది మానవ శరీరం తట్టుకునే దానికన్నా ఎక్కువ వేడికి గురవుతారు.
దిల్లీ, కోల్‌కతా, షాంఘై, ముల్తాన్, నాంజింగ్, వుహాన్ తదితర నగరాల్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తాయి. ఈ నగరాలన్నీ అల్ప, మధ్యాదాయ దేశాల్లో ఉన్న కారణంగా అందరికీ ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం కల్పించడం సాధ్యం కాదు. దాంతో మరణాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదముంది. ఒకవేళ ఉష్ణోగ్రతల పెరుగుదల 3 డిగ్రీలు దాటితే అమెరికాలోని ఫ్లోరిడా, హ్యూస్టన్, చికాగో, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే బాగా అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా తదితర దేశాల ప్రజలు.. అల్ప మధ్య ఆదాయ దేశాల ప్రజలతో పోలిస్తే కాస్త సురక్షితంగానే ఉంటారు. దురదృష్టవశాత్తు ఎక్కువ ఉష్ణ పవనాలు ఈ పేద దేశాలలోనే విజృంభిస్తాయని.. రానున్న దశాబ్దాలలో వీటి సంఖ్య పెరిగి శతాబ్దం చివరి నాటికి విపరీత పరిణామాలకు దారి తీస్తాయని ఈ అధ్యయనం హెచ్చరించింది. వీటిని అడ్డుకోవాలంటే ఏకైక మార్గం కర్బన ఉద్గారాలను తగ్గించడమేనని, ముఖ్యంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించింది. అల్పాదాయ దేశాలకు అధికాదాయ దేశాలు ఆర్థిక సాయం చేయాలని పేర్కొంది.