విధాత: బాలాసోర్ రైలు ప్రమాద ఘటనలో క్లెయిమ్ చేయని 28 మృతదేహాలకు మున్సిపల్ అధికారులు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ రెండో తేదీ రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 297 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో 269 మంది మృతదేహాలను సంబంధిత కుటుంబసభ్యులు గుర్తుపట్టి తీసుకెళ్లారు. గుర్తుతెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 28 మృతదేహాలకు శాస్త్రీయంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
“ట్రిపుల్ రైలు ప్రమాదంలో మరణించిన వారి క్లెయిమ్ చేయని 28 మృతదేహాలను శాస్త్రీయంగా పారవేయడం కోసం మేము ముందస్తు నోటీసులు జారీ చేశాము. సీబీఐ అధికారుల సమక్షంలో మృతదేహాలను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు అప్పగిస్తాం. మంగళవారం దహన సంస్కారాలకు ప్లాన్ చేస్తున్నాం’’ అని బీఎంసీ మేయర్ సులోచన దాస్ మీడియాకు వెల్లడించారు.
రైలు ప్రమాదం తర్వాత ఎయిమ్స్ భువనేశ్వర్‌కు 162 మృతదేహాలు లభించగా, వాటిలో 81 మృతదేహాలను మొదటి దశలో మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తరువాత, డీఎన్ఏ పరీక్షల తరువాత మరో 53 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. అయితే మరో 28 మంది మృతదేహాలను క్లెయిమ్ చేయలేదని అధికారి తెలిపారు. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ నుంచి సేకరించిన ఐదు డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో నాలుగు నెలలుగా 28 మృతదేహాలను భద్రపరిచారు. భువనేశ్వర్‌లోని సత్యనగర్, భరత్‌పూర్‌లోని శ్మశానవాటికలకు ఎయిమ్స్ నుంచి 28 మృతదేహాలను మంగళవారం తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.