Encounter | జమ్మూకశ్మీర్‌లో మళ్లీ కాల్పులు.. ఉగ్రవాది హతం
Encounter | జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవంతిపొరాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి.

Encounter | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవంతిపొరాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి.
అవంతిపొరాలోని థ్రాల్ ఏరియాలోని నాదిర్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భారత భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. నాదిర్ లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు.. భారత సైన్యానికి తారసపడ్డారు. దీంతో ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. బలగాలు కూడా కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు అక్కడే నక్కి ఉన్నట్లు బలగాలు పేర్కొన్నాయి. ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. 48 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్.
మంగళవారం సోపియాన్ ప్రాంతంలోని జిన్‌పాథర్ కెల్లర్‌లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వీరిని లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా బలగాలు నిర్ధారించాయి. కశ్మీర్ లోయలో పలు దాడులకు పాల్పడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.