ఎక్స్‌ హ్యాండిల్‌ బ్లాక్‌ చేయడంపై ఢిల్లీ హైకోర్టుకు కాక్రోచ్‌ జనతా పార్టీ

దేశంలో కాక్రోచ్‌ పార్టీ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. సెటైరిక్‌గా ప్రారంభించినది అయినప్పటికీ.. దానికి వస్తున్న పాపులారిటీ, అందులోని సభ్యులు లేవనెత్తుతున్న ప్రశ్నలు.. కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితం.. కాక్రోచ్‌ పార్టీ ఎక్స్‌ హ్యాండిల్‌ను కేంద్ర బ్లాక్‌ చేసింది. అయితే.. దీనిని సవాలు చేస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దిప్కే.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం దేశంలో హల్‌చల్‌ సృష్టిస్తున్న కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) న్యాయ పోరుకు సిద్ధమైంది. తన పార్టీ ఎక్స్‌ హ్యాండిల్‌ను బ్లాక్‌ చేయడాన్ని సవాలు చేస్తూ కాక్రోచ్‌ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వారంలోనే ఈ కేసు విచారణకు రానున్నదని సమాచారం. కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్‌ హ్యాండిల్‌ బ్లాక్‌ అయినట్టు మే 21న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కథనం వచ్చింది. జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) ఇన్‌పుట్స్‌ మేరకు కేంద్రం ఆదేశాలతో కాక్రోచ్‌ పార్టీ ఎక్స్‌హ్యాండిల్‌ను బ్లాక్‌ చేశారనేది ఆ వార్తల సారాంశం. అయితే.. ఈ ఖాతా.. విదేశాల్లో అందుబాటులో ఉన్నది.

కేంద్రం ఆదేశాలతో బ్లాక్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం –2000 లోని సెక్షన్‌ 69(ఏ) కింద కాక్రోచ్‌ జనతా పార్టీ ఖాతాను స్తంభింపచేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (MeitY) ఎక్స్‌ను కోరింది. సార్వభౌమత్వం, భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకోసం లేదా నేరాలకు ప్రేరేపించే చర్యలను అడ్డుకునే అవసరం ఉన్నప్పుడు ప్రజలకు కొన్ని రకాల సమాచారాలు అందుబాటులోకి రాకుండా పరిమితం చేసేందుకు ఈ నిబంధనలు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే.. తనకు పెద్ద సంఖ్యలో బెదిరింపులు వస్తున్నాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు. భారతదేశంలోని తన కుటుంబ సభ్యుల భద్రతపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా కుటుంబానికి ఏమీ జరుగకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే.. నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా నాదే. అందులో వారి భాగస్వామ్యం ఏమీ లేదు’ అని ఆయన అన్నారు.

సీజేఐ వ్యాఖ్యలతో భగ్గుమన్న జెన్‌ జీ

దేశంలో ఖాళీగా ఉంటున్న యువతలో కొందరు పరాన్నజీవులుగా, బొద్దింకలుగా తయారై వ్యవస్థపై దాడులు చేస్తున్నారని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా దిప్కే.. వ్యంగ్యాత్మకంగా ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుతో వెబ్‌ పేజీ, ఇతర సామాజిక మాధ్యమ ఖాతాలను ప్రారంభించారు. అయితే.. అప్పటికే దేశ వ్యవస్థపై తీవ్ర అసహనంతో ఉన్న యువత.. కాక్రోచ్‌ జనతా పార్టీ డిమాండ్లకు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. తమ భాషలో మాట్లాడుతున్న దిప్కేకు జెన్‌ జీ గట్టి మద్దతు పలికారు. అనేక రంగాల మేధావులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు సైతం కాక్రోచ్‌ పార్టీకి బాసగా నిలిచారు. ఒక దశలో బీజేపీ, కాంగ్రెస్‌ల ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్యను కాక్రోచ్‌ పార్టీ దాటేయడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాజకీయ పార్టీలు గడగడలాడాయి. ప్రత్యేకించి బీజేపీ, దాని ఐటీ సెల్‌ యాక్టివేట్‌ అయ్యాయి. కాక్రోచ్‌ పార్టీకి వ్యతిరేక ప్రచారం, దాడి ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ సామాజిక మాధ్యమాలను కేంద్రం బ్లాక్‌ చేసింది. ఈ నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ అభిజీత్‌ దిప్కే.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Read Also |

ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం మార్పు లొల్లి !
Maruti Suzuki సంచలనం.. జూన్ 5న దేశంలోనే తొలి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్.. పెట్రోల్ బాధ తప్పినట్లేనా?
Prabhas | ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్.. హైదరాబాద్‌లో రూ.160 కోట్ల స్థలంలో అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?

Latest News