బీజేపీకి భారీ ఎదురుదెబ్బ‌.. రాజీనామా చేసిన‌ న‌టి గౌత‌మి

  • Publish Date - October 23, 2023 / 05:43 AM IST

విధాత‌: త‌మిళ‌నాడులో బీజేపీకి భారీ షాక్ త‌గిలింది. న‌టి గౌత‌మి తాడిమ‌ళ్ల బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. 25 ఏండ్లుగా బీజేపీతో త‌న‌కు అనుబంధం ఉంద‌ని, ఆ బాధ‌ను దిగ‌మింగుకొని, ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆమె ప్ర‌క‌టించారు.


25 ఏండ్ల నుంచి త‌మిళ‌నాడులో బీజేపీ బ‌లోపేతం కోసం ఎంతో కృషి చేశాన‌ని గౌత‌మి పేర్కొన్నారు. అయితే త‌న‌ను మోసం చేసి సీ అల‌గ‌ప్ప‌న్‌కు పార్టీ నాయ‌క‌త్వం మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని, ఈ చ‌ర్య‌లు త‌న‌ను ఎంతో బాధించాయ‌ని ఆమె వెల్ల‌డించారు. బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం నుంచి తన‌కెలాంటి మ‌ద్ద‌తు లేద‌న్నారు.


అంతేకాకుండా త‌న‌ను మోసం చేసిన అల‌గ‌ప్ప‌న్‌కు పార్టీ స‌హ‌క‌రిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాన‌ని చెప్పారు. త‌న రాజీనామా లేఖ‌ను బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, త‌మిళ‌నాడు పార్టీ చీఫ్ అన్న‌మ‌లైకు పంపారు.


అల‌గ‌ప్ప‌న్ త‌న‌కు 20 ఏండ్ల క్రితం ప‌రిచయం అయ్యార‌ని గౌత‌మి తెలిపారు. ఆ ప‌రిచ‌యంతో తాను త‌న భూముల‌ను విక్ర‌యించి, ఆ ప‌త్రాల‌ను అత‌నికి అప్ప‌గించాను. కానీ అత‌ను త‌న‌ను ఇటీవ‌లే మోసం చేసిన‌ట్లు గ్ర‌హించాను. ఇక త‌న‌ను ఎవ‌రూ వంచించ‌లేర‌ని, న్యాయ పోరాటం చేస్తాన‌ని న‌టి గౌత‌మి పేర్కొన్నారు

విధాత e-Paper కోసం ఇక్కడ క్లిక్ చేయండి