అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో సిట్ బృందం కీలక ఆధారాలు సంపాదిస్తూ దర్యాప్తులో పురోగమిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేసిన సిట్ విరాళాల చోరీకి సంబంధించి అవసరమైన ఆధారాలను నిందితుల నుంచి సేకరిస్తుంది.
విరాళాల చోరీ కేసులో అవినాష్ శుక్లా కీలక నిందితుడని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గుర్తించింది. ముఖ్యంగా భక్తుల నుంచి విరాళాలను సేకరించేందుకు ఫోర్జరీ చేసిన రశీదులను వాడినట్లు అనుకల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేలు పోలీసు విచారణలో అంగీకరించారు. తాము మరో నిందితుడు టిన్నూ యాదవ్‌తో కలిసి ఫోర్జరీ రశీదులతో విరాళాలు సేకరించినట్లు వారు వెల్లడించారని, ఒక పాత నకిలీ రశీదు పుస్తకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని సిట్ వెల్లడించింది.
విరాళాల సేకరణ, లెక్కింపు వ్యవస్థలోని లోపాల ఆసరాగా నిందితులు విరాళాల చోరీని యధేచ్చగా కొనసాగించినట్లుగా సిట్ దర్యాప్తులో తేలింది. రామాలయ విరాళాల కౌంటింగ్ కేంద్రాల నుంచి చోరీ కాబడిన మొత్తం రూ.2-3 కోట్ల వరకు ఉంటుందని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. సీసీటీవీ నిఘా, భద్రతా నిబంధనల్లోని లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని వెల్లడించింది.
70సార్లు నగదు చోరీపై ఆధారాలు గుర్తింపు
విరాళాల చోరీ కేసులో ప్రధాన నిందితుతు అవినాష్ శుక్లా విరాళాల లెక్కింపు సందర్బంగా 70 సార్లు నగదును దారి మళ్లించినట్లుగా సిట్ గుర్తించింది. విరాళాల చోరీ కేసులో నిందితులైన అనుకల్ప్ మిశ్ర, లవకుష్ మిశ్ర, కరుణేష్ పాండేలను బుధవారం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆలయానికి భక్తులు సమర్పించిన నగదు విరాళాలను లెక్కించేందుకు ట్రస్ట్ శుక్లాను రూ.15 వేల వేతనంతో నియమించింది. నగదు దారి మళ్లింపు వ్యవహారం మొత్తం శుక్లాతో పాటు నిందితులుగా గుర్తించిన అనుకల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేల చుట్టు కొనసాగిందని సీసీ ఫుటేజ్‌ల పరిశీలనలో వెల్లడైందని సిట్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు మొదట శుక్లాను అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన ఇంట్లో విరాళాల హుండీ కనిపించింది. ఆయన స్వస్థలంలోనూ పోలీసులు విరాళాల సొమ్ముతో సంపాదించిన అక్రమాస్తులను గుర్తించారు.
