Nitin Gadkari | అసలు సినిమా ముందుంది.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
తన రాజకీయ భవిష్యత్తుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 11 ఏళ్ల కాలాన్ని న్యూస్ రీల్ మాత్రమేనని అభివర్ణించిన గడ్కరీ.. అసలు సినిమా 2029 తర్వాత ఉంటుందని అన్నారు. ఆ వెంటనే సర్దుకుని..

Nithin Gadkari | తన రాజకీయ భవిష్యత్తుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 11 ఏళ్ల కాలాన్ని న్యూస్ రీల్ మాత్రమేనని అభివర్ణించిన గడ్కరీ.. అసలు సినిమా 2029 తర్వాత ఉంటుందని అన్నారు. ఆ వెంటనే సర్దుకుని.. ఎవరు ఏ పాత్ర పోషించాలనేది పార్టీ నిర్ణయిస్తుందని, పార్టీ తనకు ఏ విధిని అప్పగించినా నెరవేరుస్తానని చెప్పారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో గడ్కరీని ఉదయ్ నిర్గుడ్‌కర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ తన రాజకీయ భవిష్యత్తుపై అడిగిన ప్రశ్నకు.. ‘ఇప్పటిదాకా దేశం చూసింది న్యూస్ రీల్ మాత్రమే. అసలు సినిమా మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది’ అని చెప్పారు. ‘పార్టీ కార్యకర్త బాధ్యతలను పార్టీ నిర్ణయిస్తుంది. ఆయన ఏం పనిచేయాలో నిర్ణయిస్తుంది. నాకు ఇచ్చే బాధ్యత ఏది అయినా దానిని నేను నెరవేరుస్తాను.’ అని అన్నారు.
తన రాజకీయ అనుభవాన్ని తాను ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోనని, తనను ఎయిర్‌పోర్ట్‌ల వద్ద స్వాగతించేందుకు భారీ స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తన మద్దతుదారులను ప్రోత్సహించనని గడ్కరీ చెప్పారు. తన వ్యక్తిగత మిషన్.. విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలను ఆపడమేనని తెలిపారు. ‘రహదారుల పనులే కాకుండా.. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా వ్యవసాయ రంగం, సామాజిక కార్యక్రమాలపై కేంద్రీకరిస్తున్నాను’ అని గడ్కరీ తెలిపారు. తలసరి ఆదాయం విషయంలో భారతదేశం ప్రపంచంలోని టాప్ టెన్ దేశాల జాబితాలో లేని విషయాన్ని ప్రస్తావించగా.. దానికి ప్రధాన అడ్డంకి భారతదేశంలో పెరుగుతున్న జనాభాయేనని చెప్పారు. జనాభా నియంత్రణ బిల్లుకు మద్దతు ప్రకటించిన గడ్కరీ.. ఇది మతపరమైన లేదా భాషాపరమైన సమస్య కాదన్నారు. ఇదొక ఆర్థిక సంబంధ అంశమని చెప్పారు. ఎంతో అభివృద్ధి జరుగుతున్నా.. దాని ఫలాలు కనిపించడం లేదని తెలిపారు. జనాభా పెరుగుదలే అందుకు కారణమని అన్నారు.