బీహార్ అసెంబ్లీ కీలక తీర్మానం.. 65శాతానికి రిజర్వేషన్ల పెంపు

బీహార్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన ఆసరగా విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను కూడా 65శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం 50శాతం ఉన్న రిజర్వేషన్లను 65శాతానికి పెంచాలని ప్రతిపాదించింది.

  • Publish Date - November 7, 2023 / 12:15 PM IST

10శాతం ఈడబ్ల్యుఎస్ అదనం

విధాత : బీహార్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన ఆసరగా విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను కూడా 65శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం 50శాతం ఉన్న రిజర్వేషన్లను 65శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ఈడబ్ల్యుఎస్ వర్గాలకు న్యాయ సర్వీసుల్లో, ప్రభుత్వ న్యాయ కళాశాలలు, యూనివర్సిటీల్లో 10శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంది. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లతో కలిపి రిజర్వేషన్లు 50నుంచి 75శాతానికి పెరుగనున్నాయి. అసెంబ్లీ ప్రతిపాదనల మేరకు 65శాతం రిజర్వేషన్లలో ఎస్సీలకు ఇప్పుడున్న 16శాతం నుంచి 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఓబీసీ, ఈబీసీలకు కలిపి ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 30శాతం నుంచి 43శాతానికి పెరుగనున్నాయి. ఎస్టీలకు 1శాతం నుంచి 2శాతంకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో 42శాతం పేదలే ఉన్నారని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది.

బీహార్ ప్రభుత్వం తీసుకున్న తాజా కుల గణన, రిజర్వేషన్ల పెంపు నిర్ణయాలు దేశ రాజకీయ రంగంలో పెను మార్పులకు దారితీయవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కులాల వారీ జనాభాను లెక్కించడం, వారి ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వేను నిర్వహించడం ద్వారా బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ యాదవ్‌ ఓ సంచలనమైన మార్పునకు కారణమయ్యారు. కుల గణనతో ఆర్థికంగా వెనుకబడిన కులాలను గుర్తించడం, అటువంటి కులాలకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న ఉద్ధేశంతో నితీశ్ ప్రభుత్వం కుల గణన చేపట్టినట్లుగా చెప్పినప్పటికి రాజకీయంగా బీజేపీని ఎదుర్కోనే వ్యూహం కూడా ఇందులో దాగివుంది. ఇప్పటివరకు 1990లో నాటి కేంద్రం ఆమోదించిన మండల్‌ కమిషన్‌ నివేదిక మేరకు దేశంలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

దీనిని 50 శాతానికి పెంచాలని ఓబీసీ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ ప్రభుత్వం చేసిన రీతిలో కులగణన చేసి, రిజర్వేషన్లను పెంచడానికి ఆస్కారం చిక్కింది. దీంతో బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్లను 65శాతానికి పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50శాతం మించరాదు. ఈ విషయంలో తమిళనాడుకు మాత్రమే మినహాయింపు ఇవ్వగా ఆ రాష్ట్రంలో 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడు బీహార్‌ తరహాలో దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా కులగణన చేపట్టి, రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సైతం కులగణనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించేసింది.

ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. అదే జరిగితే దేశంలో సామాజికంగా, రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ కూడా కులగణనకు సై అంటోంది. దేశవ్యాప్తంగా కూడా కుల గణన చేపట్టాలని ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. మరోవైపు 2011 తర్వాత జనగణన కూడా చేపట్టలేదు. కొవిడ్‌ కారణంగా జనగణన వాయిదా పడింది. రాబోయే కాలంలో జన, కుల గణనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు పెరుగతున్న క్రమంలో తమను కూడా బీసీల్లో కలపాలని కొన్ని అగ్రకులాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన, తద్వారా పెరిగే రిజర్వేషన్లు దేశంలో పెనుమార్పులకు బాటలు వేస్తాయని భావిస్తున్నారు. కాగా బీహార్ ప్రభుత్వం 50శాతం నుంచి 65శాతానికి మొత్తం 75శాతానికి పెంచిన రిజర్వేషన్లు ఎంతవరకు న్యాయ పరీక్షకు నిలబడుతాయన్నదీ వేచి చూడాల్సివుంది.