రాజే పోయి దియా వచ్చే!.. రాజస్థాన్‌లో కీలక నేతగా దియా కుమారి

- ప్రభ తగ్గిన వసుంధర రాజే
- మూడో లిస్టులోనూ కనిపించని పేరు
- మాజీ సీఎంను పక్కన పెట్టిన బీజేపీ?
న్యూఢిల్లీ: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభ తగ్గిపోయిందా? ఆమెను పక్కన పెట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించుకున్నదా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన మూడో జాబితాలోనూ వసుంధర రాజే పేరు కనిపించకపోగా.. మరో రాజవంశానికి చెందిన దియాకుమారి పేరు కనిపించడం విశేషం. ఆమె జైపూర్ రాజకుటుంబానికి చెందిన మహిళ. ప్రస్తుతం రాజ్‌సముంద్ ఎంపీగా ఉన్నారు. ఆమెను విద్యాధర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అధిష్ఠానం బరిలో దింపింది. ఇది బీజేపీకి సంప్రదాయకంగా పట్టున్న స్థానం.

అందుకే ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలిపినట్టు బీజేపీ నేతలు చెబుతున్నా.. రాజకీయ పరిశీలకులు మాత్రం వసుంధర రాజేను పక్కకు పెట్టే ప్రయత్నమేనని అంటున్నారు. వసుంధరపై బీజేపీ పెద్దలు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారంలో ఉన్నది. ఇప్పటి వరకూ ప్రకటించిన మూడు జాబితాల్లోనూ ఆమె పేరు లేదు. తాజాగా ముందుకు వచ్చిన దియా కుమారికి రాజస్థాన్ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 52 ఏళ్ల దియాకుమారికి రాజ్‌పుత్‌లలోనూ, మహిళల్లోనూ తగినంత పలుకుబడి ఉన్నదని చెబుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ గుర్తించే.. రాజేను తప్పించి కుమారిని ముందుకు తెచ్చిందన్న వాదన వినిపిస్తున్నది.

విధ్యాధర్ నగర్ ప్రస్తుత ఎమ్మెల్యే సర్‌పత్‌సింగ్ రజ్విపై ప్రజావ్యతిరేకత బాగా ఉన్నది. ఈయన రాజస్థాన్‌లో రాజేకు గట్టి మద్దతుదారుడు. అందుకే రాజేతోపాటు ఆమె మద్దతుదారులను కూడా ప్రక్కకు తప్పించే పథకంలో భాగంగా ఈ స్థానం నుంచి దియా కుమారిని రంగంలోకి దించారన్న ప్రచారం జరుగుతున్నది. వసుంధరకు దియాకుమారి పక్కా వ్యతిరేకి అని అంటున్నారు. రాష్ట్ర పార్టీలోనే కాకుండా.. ఢిల్లీ హైకమాండ్‌తోనూ దియాకుమారికి బలమైన సంబంధాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దియాకుమారిని ముందుకు తీసుకురావడానికి ఇవికూడా కారణాలని చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు ఆమె గట్టి పోటీ ఇవ్వగలరని బీజేపీ అధిష్ఠానం అంచనాగా చెబుతున్నారు.