న్యూఢిల్లీ : బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధురి.. ఈ విషయంలో పార్లమెంటరీ కమిటీ ముందుకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మంగళవారం ఆయన సభాహక్కుల సంఘం ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉన్నది. కానీ.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బిధురి.. విచారణకు డుమ్మా కొట్టారు. తాను ముందే నిర్దేశించుకున్న కార్యక్రమాల రీత్యా హాజరుకాలేక పోతున్నట్టు కమిటీకి తెలిపారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. రాజస్థాన్ ఎన్నికల్లో టోంక్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జిగా ఆయన ఉన్నారు. ఈ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
లోక్‌సభలో చంద్రయాన్-3పై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పలువురు ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదులపై కమిటీ విచారణ జరుపుతున్నది. ఇందుకోసం మౌఖిక వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళవారం కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. బిధురిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. బీజేపీ ఎంపీలు మాత్రం ఆయనను వెనకేసుకొస్తున్నారు. డానిష్ అలీయే బిధురిని రెచ్చగొట్టారని, పైగా ప్రధాని నరేంద్ర మోదీపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎదురుదాడికి దిగుతున్నారు.