Viral Video | హెల్మెట్‌లోకి దూరిన నాగుపాము.. బైక్ య‌జ‌మాని ఏం చేశాడంటే..?

Viral Video | హెల్మెట్‌లోకి దూరిన నాగుపాము.. బైక్ య‌జ‌మాని ఏం చేశాడంటే..?

Viral Video | విష‌పూరిత‌మైన నాగుపాములు జ‌న‌వాసాల్లోకి రావ‌డం చూస్తూనే ఉంటాం. కార్ల‌లో, ద్విచ‌క్ర వాహ‌నాల్లో నాగుపాములు దూర‌డం చూశాం. కానీ ఓ నాగుపాము మాత్రం ఏకంగా హెల్మెట్‌లోకి దూరింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని త్రిస్సూర్‌లో బుధ‌వారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. త్రిస్సూర్‌లోని పుతూర్‌లో నివాసం ఉండే పొంటెకాల్ సోజ‌న్.. త‌న బైక్‌ను తాను ప‌ని చేసే చోట పార్క్ చేసి ఉంచాడు. బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ప‌ని ముగిశాక‌.. బైక్‌ను తీసేందుకు య‌త్నించాడు. అప్ప‌టికే బైక్‌పై ఉన్న హెల్మెట్‌ను చేతిలోకి తీసుకోగా, బుస‌లు కొడుతున్న శ‌బ్దం వినిపించింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సోజ‌న్.. హెల్మెట్‌ను గ‌మ‌నించ‌గా, అందులో పాము ఉన్న‌ట్లు గుర్తించాడు.


ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా సోజ‌న్.. అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించాడు. అట‌వీశాఖ‌కు చెందిన వ‌లంటీర్ లిజో.. అక్క‌డికి చేరుకుని పామును ప‌ట్టాడు. ఈ పాము రెండు నెల‌ల వ‌య‌సు ఉంటుంద‌ని తెలిపారు. అత్యంత విష‌పూరిత‌మైన ఈ పాము.. కాసేపు ప‌డ‌గ విప్పి అంద‌ర్నీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. ఇక సోజ‌న్ త‌ల‌కు హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌డంతో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. లేదంటే ఆ పాము కాటేసి ఉండేది.