విధాత: దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ (Delhi) , ముంబయి (Mumbai) లు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వాయు కాలుష్యంతో నిండిపోయాయి. అక్టోబరులో నమోదు చేసిన వివరాల ప్రకారం.. గడిచిన దశాబ్దాల్లో ఇంతటి కాలుష్యం ఎప్పుడూ లేదని నిపుణులు వెల్లడించారు. దిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 302 (వెరీ పూర్) వద్ద ఉండగా.. ముంబయిలో అది 132 (మోడ్‌రేట్)గా ఉంది. అయితే ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో సోమవారం నాడు ఏక్యూఐ 200 దాటిపోయి పూర్ కేటగిరీలోకి వెళ్లిపోయిందని సిస్టమ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) ప్రకటించింది.
అక్టోబరులో పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం), ఉష్ణోగ్రతలు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని తెలిపింది. ఇదే వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని, అరేబియాలో ఏర్పడిన తేజ్ తుపాను గమనంపై ఆధారపడి మార్పు చోటు చేసుకుంటుందని వెల్లడించింది. మరోవైపు దిల్లీ పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెల 21, 22, 23 తేదీల్లో వాయు నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే కొనసాగింది. దీంతో రాజధాని పరిధిలో ఎవరూ కట్టెల పొయ్యిలు ఉపయోగించవద్దని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) సూచనలు జారీ చేసింది. అలాగే సిగ్నల్స్ వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలిచిపోకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తున్నారు.
ఏమిటీ కారణం?
దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పంటలను తగలబెడుతుండటంతో పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారుతోంది. అంతే కాకుండా వర్షపాతం తగినంత లేకపోవడం, గాలి వేగంగా వీయకపోవడం వాయుకాలుష్యానికి దోహదపడుతున్నాయి. ముంబయిలో ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని నిపుణులు పేర్కొంటున్నారు. రోడ్లపై రేగుతున్న దుమ్ము, ఘనపు చెత్తను సగం సగం తగలబెట్టడం, రెడీ మిక్స్ కాంక్రీట్ మెషీన్లను ఎక్కువగా వినియోగిస్తుండటం కూడా కారణాలేనని పేర్కొన్నారు.