ఢిల్లీలో రెండ్రోజులు స్కూల్స్ బంద్.. తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం

  • Publish Date - November 3, 2023 / 07:16 AM IST
  • నిర్మాణాల పనులు నిలిపివేత‌పై ఆదేశం
  • మ‌రీ తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం



విధాత‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం మరీ తీవ్ర స్థాయికి చేరుకున్న‌ది. ఎక్కడ చూసిన పొగ కమ్మువేసింది. వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్‌ క్వాలిటీని వెరీ పూర్ క్యాటగిరీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శుక్ర‌వారం చేర్చింది. ఉద‌యం 7 గంటల నాటికి AQI 376గా నమోదైంది. చాలా చోట్ల కాలుష్యం అంచనాలకు మించి రికార్డ‌వుతున్న‌ది. అశోక్‌ విహార్ ప్రాంతంలో AQI 430గా ఉన్న‌ది.


దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలోకి దిగ‌జారింది. అందుకే ఢిల్లీ వ్యాప్తంగా ప్రైమరీ స్కూల్స్‌ని రెండు రోజులపాటు మూసేస్తున్నట్టు ప్రకటించింది. నిర్మాణ ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించారు. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో విపరీతమైన కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


అత్యవసర భేటీ..


ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌ అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. చాలా చోట్ల దుమ్ముని తగ్గించేందుకు పెద్ద పెద్ద ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం కాని నిర్మాణాల పనులు ఇప్పటికిప్పుడే ఆపేయాలని ఆదేశించింది. మైనింగ్‌ కూడా ఆపేయాలని స్పష్టం చేసింది. బీఎస్‌-3 పెట్రోల్ వాహనాలతో పాటు బీఎస్‌-4 డీజిల్ ఫోర్‌ వీలర్స్‌ని ఢిల్లీ, గుడ్‌గావ్, ఫరియాబాద్, ఘజియాబాద్‌లోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. గడువు చెల్లిన వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. నగరంలోకి డీజిల్ ట్రక్కుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు.


గురుగ్రామ్ జిల్లా మేజిస్ట్రేట్ చెత్త, ఆకులు, ప్లాస్టిక్, రబ్బరు వంటి వ్యర్థ పదార్థాలను కాల్చడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టం ప్రకారం నిషేధించారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఈ సీజన్‌లో మొదటిసారిగా ఈరోజు “తీవ్రమైన” మార్కును తాకాయి, సాయంత్రం 5 గంటలకు 402 వద్ద ఉన్నాయి. వచ్చే రెండు వారాల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)ని “తీవ్రమైన” విభాగంలో నమోదు చేశాయి.