వివాహేత‌ర సంబంధం అనుమానంతో భార్య‌ను క‌డ‌తేర్చిన కానిస్టేబుల్

  • Publish Date - November 9, 2023 / 03:11 AM IST
  • 150 సార్లు ఫోన్ చేసినా.. స్పందించ‌ని భార్య
  • ఆగ్ర‌హంతో ర‌గిలిపోయి.. 230 కి.మీ. ప్ర‌యాణించి హ‌త్య‌


బెంగ‌ళూరు: ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న భార్య‌పై అనుమానం పెంచుకుని ఆమెను హ‌త్య చేశాడు. ప‌ది రోజుల కింద‌ట బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి పుట్టింట్లో ఉంటున్న భార్య‌ను చంపేందుకు 230 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాడు కానిస్టేబుల్. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క చామ‌రాజ‌న‌గ‌ర్ టౌన్‌కు చెందిన కిశోర్ కుమార్(32) కానిస్టేబుల్‌గా కొన‌సాగుతున్నాడు. 2022లో కిశోర్‌కు ప్ర‌తిభ‌(24) అనే యువ‌తితో వివాహం అయింది. ప‌ది రోజుల కింద‌టే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి పుట్టింట్లో ఉంటుంది.


అయితే భార్య త‌న స్నేహితుల‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుంద‌ని కిశోర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్య మొబైల్‌కు వ‌చ్చే మేసేజ్‌ల‌ను, వాట్సాప్ చాటింగ్‌ల‌పై క‌న్నేశాడు. వాటిపై ఆరా తీశాడు. ఆదివారం ఫోన్ చేసి భార్య‌ను తిట్టాడు. భ‌ర్త తిట్ల‌కు ఆమె ఏడ్చేసింది. ప్ర‌తిభ త‌ల్లి జోక్యం చేసుకుని ఫోన్ క‌ట్ చేసింది. అనంత‌రం కిశోర్ 150 సార్లు ప్ర‌తిభ‌కు ఫోన్ చేశాడు. ఆమె ఎంత‌కీ స్పందించ‌క‌పోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోయాడు.


ఇక చామ‌రాజ‌న‌గ‌ర్ నుంచి 230 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న అత్తారిల్లు హాస్కోట్‌కు బ‌య‌ల్దేరాడు. సోమ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు అత్తారింటికి చేరుకున్నాడు. అప్ప‌టికే పురుగుల మందు సేవించిన కిశోర్.. భార్య ఉన్న గ‌దిలోకి వెళ్లి లాక్ చేశాడు. చున్నీతో ఆమె గొంతుకు ఉరేసి చంపాడు. భార్య‌ను చంపేశానంటూ గ‌ట్టిగా కేక‌లు వేస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చాడు కిశోర్.


కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప‌రిస్థితిని స‌మీక్షించారు. భార్యను హత్య చేసే ముందు పురుగుల మందు తాగిన కిశోర్‌ పరిస్థితి విషమంగా ఉండ‌టంతో అత‌న్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌తిభ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కోలుకున్న తర్వాత నిందితుడ్ని అరెస్ట్‌ చేస్తామని పోలీస్‌ అధికారి వెల్లడించారు.