హిందీ మాట్లాడేవారు మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు.. డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

చెన్నై : డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు వచ్చే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల వారు హిందీ మాట్లాడుతారని, వారంతా రోడ్లు, భవన నిర్మాణ రంగంలో కూలీలుగా లేదా మరుగుదొడ్లు శుభ్రం చేయడానికే మాత్రమే పరిమితం అవుతున్నారని దయానిధి మారన్ వ్యాఖ్యానించారు. మారన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షేహ్‌జాద్ పూనవాలా మారన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. యూపీ, బీహార్‌లో ఉన్న ఇండియా కూటమి నేతలు.. దయానిధి మారన్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమి నేతలు కులం, మతం, భాష ఆధారంగా ఈ దేశ ప్రజలను విభజిస్తున్నారని మండిపడ్డారు. నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్, లాలు యాదవ్, అఖిలేష్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు.. దయానిధి మారన్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని పూనవాలా నిలదీశారు.
అయితే ఇంగ్లీష్ మాట్లాడే వారు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని, హిందీ మాట్లాడే వారంతా చిన్న చిన్న ఉద్యోగాలకు పరిమితం అవుతున్నారని దయానిధి మారన్ పేర్కొన్నారు. హిందీ మాట్లాడే వారు చాలా వరకు రోడ్లు, భవన నిర్మాణ రంగంలో కూలీలుగా లేదా మరుగుదొడ్లు శుభ్రం చేయడానికే మాత్రమే పరిమితం అవుతున్నారని చెప్పారు. మారన్ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్ వైరల్ అవుతోంది.
దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ కూడా మండిపడ్డారు. బీహార్ ప్రజలను అవమానించే విధంగా మారన్ మాట్లాడటం సరికాదన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామం ఉన్న నాయకులు మారన్ వ్యాఖ్యలపై స్పందించి, ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం నితీశ్ పరిపాలన సరిగా లేకపోవడం వల్లే బీహారీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.