కుక్క దెబ్బకు తోక ముడిచిన చిరుత
ఆహారం కోసం అడవుల్లో ఉండే క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. కనిపించిన జంతువులు, మనషులపై దాడి చేసి భక్షిస్తుంటాయి. అయితే ఓ చిరుత తన కంట పడిన

లక్నో : ఆహారం కోసం అడవుల్లో ఉండే క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. కనిపించిన జంతువులు, మనషులపై దాడి చేసి భక్షిస్తుంటాయి. అయితే ఓ చిరుత తన కంట పడిన కుక్కపై దాడి చేసింది. శునకం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చిరుతతో భీకరంగా పోరాడింది. చివరకు కుక్క దెబ్బకు చిరుత తోక ముడిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో సంపూర్ణనగర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దుధ్వా టైగర్ రిజర్వ్ ఉంది. ఆ టైగర్ రిజర్వ్ నుంచి ఓ చిరుత పులి సమీపంలో ఉన్న మిర్చియాన్ గ్రామంలోకి గురువారం మధ్యాహ్నం ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఫామ్ హౌజ్ వద్ద కుక్కపై చిరుత దాడి చేసింది.
కుక్కను చిరుత వెంబడించగా, అది ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిమిషం పాటు చిరుతతో శునకం భీకర పోరాటం చేసింది. కుక్కతో పోరాడలేక చిరుత చెరుకు తోటలోకి పారిపోయింది. ఈ దాడిలో చిరుత, కుక్క రెండూ గాయపడ్డాయి. ఈ ఘటనపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే చిరుతతో శునకం పోరాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.