విధాత, హైదరాబాద్ : ఎండల తీవ్రతతో తల్లడిల్లిపోతున్న తెలుగు రాష్ట్రాలకు రుతు పవనాల రాకపై ఐఎండీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది దేశంలోకి రుతుపవనాల రాక ముందుగానే ఉంటుందని. ఈనెల 14 లేదా 15న అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. భారత ప్రధాన భూభాగం వైపు రుతుపవనాల ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అంటే నైరుతి రాక ఇది సాధారణ సమయం కంటే కొద్ది ముందే కావడం విశేషం. దీంతో మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలకు కూడా ముందే వస్తాయ్..
దక్షిణాది, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఏటా జూన్ 1 కేరళను తాకే రుతుపవనాలు.. కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి సుమారు జూన్ 10న ముంబయి, ఆ తర్వాత మధ్య భారతదేశం, సుమారు జూన్ 27 నుంచి 30 మధ్య ఢిల్లీ సహా దేశం మొత్తం సుమారు జూలై 15 నాటికి విస్తరిస్తాయి.
ఇకపోతే తెలుగు రాష్ట్రాలకు సాధారణంగా జూన్ 15 నాటికి వచ్చే రుతుపవనాలు, ఈసారి కొంచెం ముందుగానే మే చివరి వారంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది.
మే నెలలో వర్షాలు..అధిక ఉష్ణోగ్రతలు
మే 7నుంచి పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, 30-40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో మే 4 నుండి మే 7 మధ్య వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఆది, సోమవారాల్లో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని , అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్-మణిపూర్-మిజోరం-త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాల్లో మే 4 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మే నెలలో పగలు మాత్రమే కాదు, రాత్రి వేళల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.
