పుదుచ్చేరి మాజీ స్పీకర్‌ కన్నన్ క‌న్నుమూత‌

  • Publish Date - November 6, 2023 / 07:36 AM IST
  • అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో తుదిశ్వాస


విధాత‌: పుదుచ్చేరి అసెంబ్లీ మాజీ స్పీకర్ పీ కన్నన్ క‌న్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న సోమ‌వారం ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌లో తుదిశ్వాస విడిచారు. కన్నన్ వైరల్ న్యుమోనియాతో బాధపడుతున్నారని ఆయన చికిత్స పొందుతున్న ద‌వాఖాన తెలిపింది.


అర్ధ దశాబ్దానికి పైగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నార‌ని కూడా వెల్ల‌డించింది. కన్నన్ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. కన్నన్‌కు 74 సంవ‌త్స‌రాలు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కన్నన్ అంత్య‌క్రియ‌లు సోమ‌వారం మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వ‌హించ‌నున్న‌ట్టు అధికార‌వ‌ర్గాలు తెలిపాయి.


కన్నన్ పుదుచ్చేరి నుంచి మంత్రిగా, స్పీకర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 1990లో కాంగ్రెస్‌ను వీడారు. దివంగత నేత జీకే మూపనార్ స్థాపించిన త‌మిళ‌ మానిలా కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఇక్కడ పుదుచ్చేరి మక్కల్ కాంగ్రెస్ అనే రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2009లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు. కాంగ్రెస్‌ను వీడి 2021లో అన్నాడీఎంకేలో చేరారు. అనంత‌రం బీజేపీలో చేరి కొన్ని నెలల క్రితం ఆ పార్టీని వీడారు.


లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తన సందేశంలో “కన్నన్ మృతి పుదుచ్చేరి రాజకీయాల్లో శూన్యతను సృష్టించింది” అని తెలిపారు. కన్నన్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎన్ రంగసామి సంతాపం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం, యువతకు నిరుద్యోగం నుంచి ఉపశమనం కలిగించడానికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.