చంద్రునిపై ఉన్నది మట్టేనా.. లేక ఇసుకా? చంద్రయాన్ 3 ఏం కనిపెట్టింది?

ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నపుడు నేలపై ఉన్న మట్టి పైకి లేవడం చూస్తూనే ఉంటాం. అదే తరహాల్లో చంద్రయాన్ 3 (Chandrayaan 3)రోవర్.. జాబిల్లి ఉపరితలంపై దిగినపుడు పెద్ద ఎత్తున మట్టి భూమిపైకి లేచిందని ఇస్రో గుర్తించింది. అక్కడి మట్టి గురించిన విషయాలను తెలుసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలను జర్నల్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ లో ప్రచురించారు. దీని ప్రకారం.. విక్రమ్ ల్యాండర్ దిగక ముందు, దిగిన తర్వాత తీసిన చిత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించగా అక్కడు ఒక భారీ గొయ్యి లాంటిది ఏర్పడినట్లు గుర్తించారు. ల్యాండర్ దిగినపుడు దుమ్ము భారీ ఎత్తున లేవడంతోనే ఈ గుంత ఏర్పడినట్లు తెలిసింది.
భూమిపై అయితే గురత్వాకర్షణ శక్తి , వాతావరణం ఉండటంతో హెలికాప్టర్ ద్వారా లేచిన దుమ్ము కొన్ని నిమిషాల్లో తిరిగి నేలను చేరుకుంటుంది. చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నా.. అది బలహీనంగా ఉంటుంది. వాతావరణ కూడా ఉండదు. అందుకే పైకి లేచిన జాబిల్లి (Moon) ధూళి కింద పడటానికి చాలా సమయం తీసుకుంది. విక్రమ్ ల్యాండర్ పంపించిన సమచారాన్ని విశ్లేషించిన అనంతరం ల్యాండింగ్ సమయంలో సుమారు 2.06 టన్నుల ధూళి పైకి లేచినట్లు తేలింది.
అయితే అమెరికాకు చెందిన అపోలో ల్యాండర్ దిగినపుడు రేగిన 6 టన్నుల ధూళి కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. అపోలో కంటే విక్రమ్ తక్కువ బరువు కావడం కూడా దీనికి ఒక కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అదే కాకుండా ల్యాండర్ దిగిన ప్రాంతంలో మట్టి (Lunar Sand) … వదులుగా కాకుండా.. కాస్త తడిగా ముద్ద ముద్దగా ఉండటమూ మరో కారణమని తెలుస్తోంది.
అయితే విక్రమ్ ల్యాండర్ వల్ల తేలికైన ఇసుక లాంటి పదార్థం అంతా దూరంగా ఎగిరిపోయి.. లోపలి పొరలో ఉన్న మట్టి లాంటిదే అక్కడ మిగిలిందా అనే కోణంలోనూ పరిశోధన జరుగుతోంది. ఇలా ల్యాండర్‌ల వల్ల ఎగసిపడే ధూళి గురించి ఇప్పటికే ఒక పరిశోధన పత్రం విడుదలైంది. దీనిని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రచురించింది. ఇలా రేగిన ధూళి చంద్రుని చుట్టూ తిరుగుతున్న మాడ్యూళ్లకు, భవిష్యత్తు ప్రయోగాలకు ఆటంకం కలిగిస్తుందని తెలిపింది.