బీజేపీకి 200 సీట్లు దాటడమే గగనం!

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు దాటడానికే కష్టపడాల్సి వస్తుందని యక్సిస్‌ మై ఇండియాదిగా చెబుతున్న పోల్‌ సర్వే పేర్కొంటున్నది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 248 సీట్ల వద్దే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది

  • Publish Date - April 19, 2024 / 08:36 PM IST

యాక్సిస్‌ మై ఇండియా సర్వేలో వెల్లడి?
తమది కాదంటున్న సర్వే సంస్థ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు దాటడానికే కష్టపడాల్సి వస్తుందని యక్సిస్‌ మై ఇండియాదిగా చెబుతున్న పోల్‌ సర్వే పేర్కొంటున్నది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 248 సీట్ల వద్దే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. అందులో బీజేపీకి 215 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. మరోవైపు ఇండియా కూటమి 236 సీట్లు గెలుచుకుంటుందని, అందులో కాంగ్రెస్‌కు 118 స్థానాలు వస్తాయని పేర్కొన్నది. పదికిపైగా రాష్ట్రాల్లో బీజేపీ భారీ నష్టాలు చవిచూడనున్నదని అంతర్గతంగా చేసినట్టు చెబుతున్న రహస్య సర్వే అంచనా వేసింది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్‌ గణనీయంగా పుంజుకుంటుందని తెలిపింది. అయితే.. ఈ సర్వే తమది కాదని, తమ పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని యాక్సిస్‌ మై ఇండియా సామాజిక మాధ్యమాల్లో వివరణను ఇచ్చింది. అసలు తాము అలాంటి సర్వే ఏదీ చేయలేదని పేర్కొన్నది. అయితే.. ఆ సంస్థ చేసినట్టు చెబుతున్న సర్వే ఫలితాల్లో ఎన్డీయే 44శాతం, ఇండియా కూటమి 43 శాతం, ఇతరులు 13 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీని ప్రకారం బీజేపీ 208 నుంచి 219 సీట్లలో గెలుస్తుందని అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షాలు 35 నుంచి 38 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ 115 నుంచి 123 సీట్లలో, ఇండియా భాగస్వామ్య పక్షాలు 120 నుంచి 128 సీట్లలో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఇతరులు 45 నుంచి 55 సీట్లలో విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సర్వే అంతర్గతంగా చేసినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తున్నది. ఇదే నిజమైతే రానున్న రోజుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరింత బలహీనపడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest News