ఒడిశా మాజీ స్పీక‌ర్ మొహంతి క‌న్నుమూత‌

  • Publish Date - November 7, 2023 / 08:47 AM IST

సెరిబ్రల్ స్ట్రోక్‌తో 1న ప్రైవేటు ద‌వాఖాన‌లో చేరిక‌

చికిత్స పొందుతూ తెల్ల‌వారుజామున తుదిశ్వాస‌

2004- 08 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్య‌త‌లు


విధాత‌: బిజు జ‌నతా ద‌ళ్ (బీజేడీ) సీనియర్‌ నేత, ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి (67) కన్నుమూశారు. భువ‌నేశ్వ‌ర్‌లోని ఓ ప్రైవేట్‌ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ మంగళవారం మ‌ర‌ణించారు. మెద‌డుకు ర‌క్త ప్ర‌సర‌ణ‌లో ఆటంకం ఏర్ప‌డ‌టంతో (సెరిబ్రల్ స్ట్రోక్‌) ఆయ‌న ఈ నెల ఒక‌టో తేదీన ఓ ప్రైవేటు ద‌వాఖాన‌లో చేరారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించి మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


మొహంతి పూరీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1995లో జనతాదళ్ అభ్యర్థిగా, 2000, 2004, 2009, 2014లో బీజేడీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1956 ఫిబ్రవరి 26న‌ జన్మించిన మొహంతి.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో 2011-2019 మధ్య క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. మొహంతి మృతి ప‌ట్ల‌ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయ‌క్ సంతాపం ప్ర‌క‌టించారు.