Tigers | గత ఐదేండ్లలో 628 పులులు మృతి.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే..?
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గత ఐదేండ్లలో 628 పులులు మృతి చెందినట్లు తేలింది. అత్యధికంగా మహారాష్ట్రలో 200 పులులు మృతి చెందాయని కేంద్ర పర్యావరణ సహాయ మంత్రి కృతి వర్ధన్ సింగ్ నిన్న రాజ్యసభలో వెల్లడించారు

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గత ఐదేండ్లలో 628 పులులు మృతి చెందినట్లు తేలింది. అత్యధికంగా మహారాష్ట్రలో 200 పులులు మృతి చెందాయని కేంద్ర పర్యావరణ సహాయ మంత్రి కృతి వర్ధన్ సింగ్ నిన్న రాజ్యసభలో వెల్లడించారు. సహజ కారణాలతో పాటు వేటాడడం కారణంగా పులులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకారం.. 2019లో 96, 2020లో 106, 2021లో 127, 2022లో 121, 2023లో 178 పులులు మృతి చెందాయి. 2012 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా 2023లో పులుల మరణాలు నమోదైనట్లు నివేదిక ద్వారా తేలింది. 2019 నుంచి 2020 ఏడాది వరకు ప్రతి సంవత్సరం పులుల దాడిలో 49 మంది చనిపోయారు. 2021లో 59, 2022లో 110, 2023లో 82 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 59 మంది, మధ్యప్రదేశ్‌లో 27 మంది చనిపోయినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
భారతదేశలో పులుల సంఖ్య 3,682 కాగా, ప్రపంచంలోని పులుల జనాభాలో ఇది దాదాపు 75 శాతం అని తెలిపారు. పులుల సంరక్షణను ప్రోత్సహించడానికి కేంద్రం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్టు టైగర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న తొమ్మిది టైగర్ రిజర్వ్‌లను కవర్ చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 78,735 చదరపు కిలోమీటర్లలో 55 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి.