IRCTC Ticket Cancellation New Rules : రైల్వే టికెట్‌ క్యాన్సిలేషన్‌ లో కొత్త మార్పులు

రైల్వే టికెట్ క్యాన్సిలేషన్‌పై కొత్త నిబంధనలు.. 72 గంటల ముందు పూర్తి రీఫండ్, చివరి నిమిషం మార్పులకు సడలింపు, ప్రయాణికులకు భారీ ఊరట

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 24, 2026, 4:36 pm IST
Read Time: 6 mins
IRCTC Ticket Cancellation New Rules : రైల్వే టికెట్‌ క్యాన్సిలేషన్‌ లో కొత్త మార్పులు

విధాత : భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలక సమాచారం అందించింది. రైలు బయల్దేరే సమయం ఆధారంగా టికెట్‌ సొమ్మును రిఫండ్‌ చేసే విధానాన్ని సవరించింది. టికెట్‌ క్యాన్సిలేషన్‌, బోర్డింగ్‌ పాయింట్‌ నిబంధనలలో పలు కీలక మార్పులు చేసింది. ప్రయాణికుల సేవల్లో పారదర్శకత, రవాణా సామర్థ్యం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదు కీలక సంస్కరణలను ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య దశలవారీగా ఈ మార్పులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

టికెట్‌ క్యాన్సిలేషన్‌ లో కొత్త నిబంధనలు

కొత్త నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు కన్ఫామ్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే దాదాపు పూర్తి రిఫండ్‌ ఇస్తారు. కేవలం రద్దు ఛార్జీలు మాత్రమే విధిస్తారు.
72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 75 శాతం, 24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్‌ రద్దు చేసుకుంటే 50 శాతం రిఫండ్‌ చేస్తారు. ఎనిమిది గంటల కంటే తక్కువ సమయం ఉన్నా లేదా రైలు బయలుదేరిన తర్వాత రద్దు చేసినా ఎటువంటి రీఫండ్ ఉండదు.

చివరి నిమిషంలో టిక్కెట్లు రద్దు చేయడం వల్ల సీట్లు వృధా అవుతున్నాయని.. తద్వారా వేచి ఉన్న ఇతర ప్రయాణికులకు అవకాశం దక్కడం లేదని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 8 గంటల నిబంధన ద్వారా సీట్ల లభ్యతను మెరుగుపరచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

బోర్డింగ్‌ పాయింట్‌ నిబంధనలలో సైతం మార్పులు

ప్రయాణికులు తమ ప్రయాణ తరగతిని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి లేదా బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవడానికి గతంలో ఉన్న పరిమితులను సడలించారు. ఇకపై రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. గతంలో రిజర్వేషన్ చార్ట్ తయారీకి ముందే ఈ మార్పులు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ గడువును చివరి నిమిషం వరకు పొడిగించడం ప్రయాణికులకు ఎంతో లాభదాయకంగా కనిపిస్తుంది.

సరుకు రవాణాలోనూ కీలక మార్పులు

రైల్వే ఆదాయ వనరుల్లో ప్రధానమైన సరుకు రవాణా రంగంలో కూడా పలు మార్పులు చేశారు. ముఖ్యంగా ఉప్పు, ఆటోమొబైల్స్ (కార్లు, వాహనాలు) రవాణాను వేగవంతం చేసేందుకు కొత్తగా సింగిల్-డెక్, డబుల్-డెక్ వ్యాగన్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ సరుకును సురక్షితంగా రవాణా చేసే అవకాశం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే నిర్మాణ ప్రాజెక్టుల నాణ్యతను పెంచడంపై కూడా ప్రత్యేక నిఘా వ్యవస్థను కొనసాగించనున్నట్లుగా రైల్వే మంత్రి తెలిపారు. 2026 నాటికి భారతీయ రైల్వేను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు అమలులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

మహేష్ కుమార్ గౌడ్ బీసీ సీఎం వ్యాఖ్యల మర్మమేమిటో?
ఆరు లైన్లు…డబుల్ డెక్కర్ తో విజయవాడ – హైదరాబాద్ హైవే : మంత్రి వెంకట్ రెడ్డి